
Rcbఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా ఆర్సీబీ నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్లుగా తీరని కలను ఆర్సీబీ 18వ ఐపీఎల్ ఎడిషన్‌లో తీరింది. టీమ్ మొత్తం అద్భుత ప్రదర్శన కనబర్చి.. ఆర్సీబీ విజేతగా అవతరించింది. అయితే.. ఆర్సీబీ కప్పు అయితే కొట్టింది కానీ.. వాళ్ల టీమ్ నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా ఒక్కటంటే ఒక్క వ్యక్తిగత అవార్డు అందుకోలేదు. మరి ఐపీఎల్‌లో ఉండే ఆరెంజ్ క్యాప్, పర్పల్ క్యాప్, అత్యధిక ఫోర్లు, సిక్సులు కొట్టిన ప్లేయర్లు, అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్, క్యాప్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం..

ఐపీఎల్ 2025 సీజన్ కి గాను సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు. మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు సూర్యకే వచ్చింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా సూర్యనే కైవసం చేసుకున్నాడు. అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ మాత్రం సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) సొంత చేసుకున్నాడు. ఈ సీజన్‌లో సాయి సూపర్ బ్యాటింగ్‌తో 759 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో క్యాచ్ ఆఫ్ ది సీజన్ అంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కమిండు మెండిస్ పట్టిన క్యాచ్. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో డెవాల్ట్ బ్రెవిస్ కొట్టిన భారీ షాట్‌ను గాల్లో పక్షిలా ఎగుతురుతూ మెండిస్ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. సో.. ఐపీఎల్ 2025 గాను క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్నాడు. ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో ప్రసిద్ధ్ 25 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌కు గాను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డును సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) అందుకున్నాడు. అలాగే ఈ సీజన్‌లో డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా మొహమ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్) నిలిచాడు. ఈ సీజన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ ఏకంగా 144 డాట్ బాల్స్ వేశాడు. ప్రతి డాట్ బాల్‌కు బీసీసీఐ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సో.. ఆ విధంగా పర్యావరణానికి మేలు చేసిన అవార్డును సిరాజ్ గెలుచుకున్నాడు.

ఈ సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్‌లో పూరన్ తన భీకర బ్యాటింగ్‌తో ఏకంగా 40 సిక్సులు బాదేశాడు. ఇక ఫోర్ల విషయానికి వస్తే.. 88 ఫోర్లు కొట్టిన సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) ఈ ఏడాది అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్‌గా అవార్డు తీసుకున్నాడు.