
జూలై 28న అట్టహాసంగా ప్రారంభమైన కామన్వెల్త్ క్రీడలు సోమవారంతో ముగిశాయి. ఇక ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో భారత ప్రయాణం అద్భుతంగా సాగింది. పలువురు ఆటగాళ్ళు పతకాలతో చరిత్ర సృష్టించారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణంతో మొదలైన ప్రయాణం హాకీలో రజత పతకంతో ముగిసింది.

ఈ క్రీడల్లో భారత్ తరఫున 104 మంది పురుషులు, 103 మంది మహిళలు పాల్గొన్నారు. మొత్తం 61 పతకాలు సాధించారు. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. పురుషులు 35, మహిళలు 26 పతకాలు సాధించారు. తద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది.

రెజ్లింగ్‌లో భారత్‌కు అత్యధికంగా 12 పతకాలు లభించాయి. కుస్తీవీరులు మొత్తం ఆరు బంగారు పతకాలు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు గెల్చుకున్నారు. లాన్ బాల్ (ఒక స్వర్ణం, ఒక రజతం)లో మనదేశం తొలిసారిగా పతకం సాధించగలిగింది. అదే సమయంలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్‌లో మన ఆటగాళ్లు సత్తాచాటారు.

ఇక భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం10 పతకాలు సాధించారు. బాక్సింగ్‌లోనూ 7 పతకాలు వచ్చాయి. అదే సమయంలో బ్యాడ్మింటన్‌లో 3 బంగారు పతకాలు వచ్చాయి. ఇక స్క్వాష్‌లోనూ రెండు పతకాలు గెల్చుకున్నారు.

గతేడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 66 పతకాలు సాధించింది. ఇందులో 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి.