
దక్షిణ దిశ అగ్ని మూలకంతో ముడిపడి ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో సూర్యుని శక్తి ఈ దిశలో చాలా తీవ్రంగా ఉంటుంది. కనుక ఈ దిశలో శక్తిని సమతుల్యం చేసే మొక్కలను నాటాలి. ఉదాహరణకు సూర్యుడు, అంగారక గ్రహానికి సంబంధించిన మందార, గులాబీ వంటి ఎర్రటి పుష్పించే మొక్కలను నాటడం శుభప్రదం.

అంతేకాదు దక్షిణ దిశ కుజుడు, శనీశ్వరుడి గ్రహాలతో ముడిపడి ఉంది. ఈ దిశలో పలాష్ ("ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్") లేదా వేప వంటి మొక్కలను నాటడం ద్వారా ఈ గ్రహాల వలన కలిగే అశుభ ప్రభావాలను నియంత్రించవచ్చు.

మందార మొక్క, వేప మొక్కలు ముఖ్యంగా చెడు దృష్టి నుంచి రక్షించడంలో ప్రభావవంతంగా పరిగణించబడతాయి. దక్షిణ దిశలో ఈ మొక్కలను పెంచుకోవడం వలన ఇంటిని రక్షించడమే కాకుండా వ్యాధులను కూడా నివారిస్తుంది.

మందారం, వేప వంటి మొక్కలు క్రిమిసంహారకాలు, శక్తిని శుద్ధి చేసేవి. దక్షిణ దిశను యమ దిశగా పరిగణిస్తారు. కనుక ఈ మొక్కలను అక్కడ నాటడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది.

దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు. అక్కడ మందార లేదా పారిజాత మొక్కను నాటడం వల్ల పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది. పూర్వీకుల ఆశీస్సులు నిలిచి ఉంటాయి.

ఎరుపు రంగు మొక్కలు (ఎరుపు గులాబీ, మందార వంటివి) దక్షిణ దిశలోని అగ్ని శక్తిని సమతుల్యం చేస్తాయి. కుటుంబ సభ్యులకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి.