
గరుడ వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని విశ్వాసం.

జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తున్నాడు.

గరుడ వాహన సేవలో సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళలను చక్కగా ప్రదర్శించారు.

తిరుమాడ వీధులు భారతీయ తాత్విక చింతనతో పులకించి, మురిసిపోయింది. మొత్తం 28 కళా బృందాలు 713 మంది కళాకారులు పాల్గొన్నారు.

ఆంద్రప్రదేశ్ తో పాటు రాజస్థాన్, తెలంగాణ, పాండిచ్చేరి, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, త్రిపుర, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం 15 రాష్ట్రాల నుండి విచ్చేసిన ఆయా రాష్ట్రాల సుప్రసిద్ధ, జానపద కళారూపాల ప్రదర్శనతో భక్తులను భక్తి సాగరంలో ముంచారు.

రాజస్థాన్ కు చెందిన రూప్ సింగ్ బృందం ప్రదర్శించిన చారి రూపకం, తెలంగాణ నుండి అశోక్ బృందం థింసా నృత్యం, తెలంగాణ గోపీనాథ్ బృందం నుండి బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవం రూపకం, గుజరాత్ కు చెందిన చేతన్ జెట్వా బృందం ప్రదర్శించిన తిప్పని గర్భ జానపద నృత్యం, మధ్యప్రదేశ్ కు చెందిన మయాంక్ తివారీ బుందేల్ఖండ్ నృత్య విన్యాసాలు ఆలరించాయి.

ఒరిస్సాకు చెందిన రవినారాయణ్ భూమి నృత్యం , హైదరాబాద్ కు చెందిన శ్వేత భంగ్ర నృత్యం, మహారాష్ట్రకు చెందిన డా. రాహుల్ హాలడే ప్రదర్శించిన లావని గోందల్ నృత్యం, కేరళకు చెందిన రవీంద్ర నంబియార్ బృందం ప్రదర్శించిన మయూర నృత్యం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.

మణిపూర్ కు చెందిన గోవిందమ్మ ప్రదర్శించిన సాంప్రదాయ మణిపూరి నృత్యం, త్రిపురకు చెందిన అల్లంజంపన్ ప్రదర్శించిన కొరియా వంగళ నృత్యం చూపరులను ఆకట్టుకుంది.

జార్ఖండ్ కు చెందిన అన్సర్ దివాకర్ ప్రదర్శించిన ముండరి నృత్యం, కేరళకు చెందిన మహదేవన్ ప్రదర్శించిన ఒరియాడి నృత్యం కనుల విందు చేసింది.

అస్సాంకు చెందిన జోయ్ దేవ్ అస్సామిబిహు నృత్యం, ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఉమాశంకర్ దేల్ల బృందం ప్రదర్శించిన కజరీ నృత్యం భక్తిరసాన్ని నింపాయి.

తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, శోభారాణి, వంశీధర్, శ్రీనివాసులు, కోకిల కోలాట బృందాల ప్రదర్శన, కడప, రాజమండ్రికి చెందిన డప్పుల విన్యాసాలు అలరించాయి.

కర్నాటకకు చెందిన ఇందు భరత నాట్యం, తిరుపతికి చెందిన డా. మురళీకృష్ణ బృందం ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణ రూపకం భక్తులును పరవసింపచేసింది.

గరుడ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.