
రుషికేశ్ నుంచి 70కి.మీ దూరంలో ఉంది దేవప్రయాగ. ఇది కుబేరుని పట్టణమైన అలకాపురి నుండి వచ్చే అలకనంద మరియు గంగోత్రినుండి వచ్చే భాగీరథీ నదుల సంగమం. ఇక్కడ రఘునాథ్ మందిరముంది. ఈ ఆలయాన్ని విధిగా దర్శించాలి. శ్రీరాముడు ఇక్కడ అశ్వమేధయాగం చేసిన ప్రదేశంగా పురాణాల కథనం

రిషీకేశ్ నుండి 140 కి. మీ దూరంలో ఉంది రుద్రప్రయాగ. ఇక్కడ మందాకినీ , అలకనందా నదులసంగమం చూడవచ్చు. ఇక్కడ రుద్రనాథమందిరం, చాముండాదేవి ఆలయం ఉన్నాయి. శంకరుడు నారదునకు సంగీతం నేర్పిన ప్రదేశమిది. శంకరుడు వీణానాదాన్ని(రుద్రవీణ) ఆలపించిన చోటుగా ప్రసిద్ధి

రిషీకేశ్ నుండి 169 కి. మీ దూరంలో ఉంది కర్ణప్రయాగ. ఈ ప్రాంతం అలకనంద మరియు పిండారీ నదుల సంగమం. కర్ణుడు తపమాచరించి శంకరుని ప్రసన్నం చేసుకున్న ప్రదేశం. స్వామివివేకానంద ఇక్కడ 18రోజులు తపమాచరించాడు. ఇక్కడ ఉమాదేవి ఆలయం ప్రసిద్ధి.

రిషీకేశ్ నుండి 190 కి.మీ.దూరంలో ఉంది నందప్రయాగ. అలకనంద , నందాకినీ నదుల సంగమం. నందుడు యజ్ఞమాచరించిన ప్రదేశం. నందగోపాలుని మందిరమిక్కడ ఉంది. కణ్వాశ్రమము ఇక్కడనే ఉండేదట. దుష్యంతుడు, శకుంతలను వివాహం చేసుకున్న స్థలంమని.. శ్రీ కృష్ణుడుపెరిగిన నందుని ఊరు ఇది అని స్థానికుల కథనం

రిషీకేశ్ నుండి 256 కి.మీ.దూరంలో విష్ణుప్రయాగ ఉంది. అలకనంద , ధౌళిగంగ ల సంగమమిది. నారదుడు విష్ణు భగవానునికై తపమాచరించిన ప్రదేశమిది.ఇక్కడ విష్ణ్వాలయం ఉంది. సంగమం వద్ద విష్ణు కుండం ఉంది.