హిందూ మతంలో భగవంతుని ఆరాధనలో ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పూజ సమయంలో వివిధ రకాల ప్రసాదాలను దేవుళ్లకు సమర్పిస్తారు. దేవుడిని పూజించే సమయంలో సమర్పించే నైవేద్యంగా వారికి నచ్చింది పెట్టడం వలన సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. దేవుళ్ళు అనుగ్రహం కలుగుతుందని కోరిన కోర్కెలు నేరవేరుస్తారని విశ్వాసం. ఈ రోజు హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళకు ఏ ప్రసాదాన్ని సమర్పించాలి.. ఏ ప్రసాదాన్ని ఎక్కువగా ఇష్టపడతారంటే
దేవుళ్లకు ఆహారాన్ని సమర్పించేటప్పుడు ప్రత్యేక నియమాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దేవుళ్ళకు సమర్పించే నైవేద్యం స్వచ్చంగా, తాజాగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ప్రసాదాన్ని సమర్పించే సమయంలో మనస్సులో భక్తి ఉండాలి. ప్రేమతో, భక్తితో దేవుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన దేవుళ్లు సంతోషిస్తారు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తారు. వివిధ రకాల ఆహరాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన ఆధ్యాత్మిక భావనలు పెంపొందిస్తుంది.
గణపతికి ఇష్టమైన ఆహారం: శివపార్వతుల తనయుడు గణపతి విఘ్నాలకధిపతి ఆదిపూజ్యుడుగా పూజలను అందుకుంటాడు. వినాయకుడి ఆరాధనలో గణపతికి అత్యంత ఇష్టమైన ప్రసాదం మోదకం అంటే ఉండ్రాళ్ళు, కుడుములు లేదా లడ్డులను సమర్పించాలి. గణేశుడిని పూజించే సమయంలో ఉండ్రాళ్ళు సమర్పించాలి. దీంతో గణపతి త్వరగా సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్మకం.
విష్ణువుకి ఇష్టమైన నైవేద్యం: సృష్టి పాలకుడు శ్రీ మహా విష్ణువు ఆరాధనలో ఆవు పాలు, ఆవు పాలతో తయారు చేసిన బియ్యం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యంలో తులసి దళాలను వేసి తప్పని సరిగా సమర్పించాలి. ఎందుకంటే తులసి దళం లేకుండా విష్ణువుకి సమర్పించే నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అందుచేత శ్రీ హరికి తులసి దళంతో వేసిన ఆహారాన్ని మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి.
రాముడికి ఇష్టమైన నైవేద్యం: దశరథానందడు.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడిని పూజించే సమయంలో రామయ్యకు ఇష్టమైన వస్తువులను నైవేద్యంగా సమర్పిస్తే.. ఆశీర్వాదం పొందుతాడు. పూజలో కుంకుమపువ్వు, పాయసాన్ని శ్రీరాముడుకి నైవేద్యంగా సమర్పిస్తే రామయ్య సంతోషిస్తాడని నమ్మకం.
శివుడికి వేటిని నైవేద్యంగా సమర్పించాలంటే.. అన్ని దేవతల కంటే శివుని ఆరాధన చాలా సులభంగా పరిగణించబడుతుంది. కేవలం నీటితో అభిషేకం చేసినా భోలాశంకరుడు అనుగ్రహిస్తాడు. శివుని అనుగ్రహాన్ని పొందాలనుకుంటే పూజలో ఆయనకు ఇష్టమైన పంచామృత ప్రసాదాన్ని అందించండి. అంతేకాదు గంజాయి ని కూడా శివయ్యకు ఇష్టమైన నైవేద్యంగా పెద్దలు చెబుతారు. త్రిమూర్తుల మేళా వంటి పూజ సమయంలో తప్పనిసరిగా నైవేద్యంగా గంజాయిని సమర్పిస్తారు.
హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం కలియుగంలో నడియాడే దైవంగా హనుమంతుడిని భావిస్తారు. అత్యంత ఫలప్రదంగా భావించే హనుమంతుడి పూజ చేస్తున్నప్పుడు ప్రసాదంగా పాయసం, డ్రై ఫ్రూట్స్, బూందీ, బెల్లంతో చేసిన లడ్డూలు. తమల పాకులు , అరటి పండ్లు తప్పనిసరిగా సమర్పించాలి. ఆయనకు ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పించడం వలన భక్తుడిని ఆశీర్వదించి కష్టాలు తీరుస్తాడని నమ్మకం
శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యం: 16 కళలతో నిండిన శ్రీకృష్ణుని ఆరాధనలో తప్పని సరిగా వెన్న, పంచదార కలిపిన పదార్ధాన్ని సమర్పించాలి. అంతేకాదు ఖీర్, సేమ్యా పాయసం, బొబ్బట్లు, లడ్డూ, తీపి పదార్ధాలను నైవేద్యంగా సమర్పించాలి. అయితే ఈ ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించే సమయంలో తులసి దళాలు జోడించడం తప్పని సరి. ఎందుకంటే శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం.