
మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులంటే గురువుగా చాలా ఇష్టం. ఈ రాశులవారికి శని దోషాలు పట్టినా, కాలసర్ప దోషం పట్టినా, ఇతర అవయోగాలు కలిగినా గురువు వీరిని ఏదో విధంగా ఆదుకుంటూనే ఉంటాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. తనకు ఇష్టమైన ఈ రాశులవారికి గురువు ఈ దోషాల ప్రభావాన్ని బాగా తగ్గించడంతో పాటు, ఆర్థిక బలాన్ని కలిగిస్తూనే ఉంటాడు. ఈ ఏడాది ఈ రాశులవారు శని దోషం ఉన్నా గురు బలంతో, గురువు తోడ్పాటుతో వీరు మిలియనీర్లుగా ఎదిగే అవకాశం ఉంది.

మేషం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రారంభమైనప్పటికీ ఈ రాశికి గురువు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల శని దోషం బాగా తగ్గిపోవడంతో పాటు గతం కంటే మెరుగైన ఆర్థిక బలం కలుగుతుంది. ఆర్థికాభివృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా నూరు శాతం ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా బాగా కలిసి వచ్చి, ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ విజయవంతం అయి ఈ రాశివారు మరో 4 నెలల్లో తప్పకుండా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. షేర్ల వల్ల కూడా అత్యధిక లాభాలు కలుగుతాయి.

కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడికి అత్యంత శుభుడు, మిత్రుడు అయిన గురువు వల్ల ఈ రాశివారు ఈ ఏడాది చివరి లోగా సంపన్నులయ్యే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడుగా ఎదిగే అవకాశం ఉంది. రెండు మూడు పర్యాయాలు ధన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభించడంతో పాటు ఆస్తి విలువ పెరుగుతుంది.

సింహం: లాభ స్థానంలో సంచారం ప్రారంభించిన గురువు వల్ల ఈ రాశివారికి అష్టమ శని దోషం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. షేర్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు, భూముల క్రయ విక్రయాలు వగైరాల వల్ల అపారమైన ధన లాభం కలుగుతుంది. సొంత ఇంటి భాగ్యం కలుగుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అంచనాలకు మించి పిత్రార్జితం లభిస్తుంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడికి గురువు అత్యంత సన్నిహితుడైనందువల్ల ఈ రాశికి గురువు అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ముగిసే లోగా ఈ రాశివారిని ఆర్థికంగా శక్తిమంతులుగా చేయడంతో పాటు ఆర్థిక సమస్యలను దాదాపు పూర్తిగా తొలగించడం జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈ రాశివారికి గురు బలం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించి పెరుగుతాయి.

ధనుస్సు: ఈ రాశికి అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పటికీ, సప్తమ స్థానంలో సంచారం ప్రారంభించిన రాశ్యధిపతి గురువు వల్ల ఈ శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలతో పాటు లాటరీల వల్ల కూడా అత్యధికంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది.

మీనం: ఈ రాశికి ఏలిన్నాటి శని దోషం జరుగుతున్నప్పటికీ, రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచరం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి శని దోషం అంటదు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి. పెళ్లి, సంతాన ప్రాప్తి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా స్థితిగతులు పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు పెరిగే అవకాశం ఉంది.