
మేషం: ధన కారకుడైన గురువుకు అత్యంత బలహీన స్థానం తృతీయ స్థానం. ఈ రాశికి ప్రస్తుతం గురువు తృతీయంలో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయాన్ని పెంచుకోవడంలో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ రాశివారికి డబ్బు ఊరికే రాదు. ఎంత జాగ్రత్తగా ఖర్చు చేస్తే అంత మంచిది. వచ్చే మే వరకు ఈ రాశివారు వృథా ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఉచిత సహాయాలు, దాన ధర్మాల వల్ల చేతిలో డబ్బు నిలవదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా తగ్గిపోతుంది. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. తీర్థయాత్రలు, విహార యాత్రల వల్ల కూడా చేతిలో డబ్బు నిలవదు. ఈ రాశివారు డబ్బు ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ పెట్టుకోకూడదు. ఆర్థిక లావాదేవీల వల్ల బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. సన్నిహితుల వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి ధనాధిపతి కూడా అయిన గురువు అష్టమ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక వ్యవహారాలను అజమాయిషీ చేయడంలో వీరు చాలావరకు విఫలమవుతారు. ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. వైద్య ఖర్చులు, వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

మకరం: ఈ రాశికి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక లావాదేవీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగకపోవడం, వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగడం వంటివి జరుగుతాయి.

మీనం: ఈ రాశికి గురువు చతుర్థ స్థానంలో సంచారం చేయడం ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ఏమంత మంచిది కాదు. మితిమీరిన ఔదార్యంతో ఉచిత సహాయాలు, దానధర్మాలకు పాల్పడడం జరుగుతుంది. డబ్బు తీసుకున్నవారు తిరిగి ఇచ్చే అవకాశం ఉండదు. బంధుమిత్రులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా వృద్ధి చెందుతాయి. ఏ పని తలపెట్టినా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.