
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. చికెన్ 1/2 kg, పసుపు 1/4 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నుంచి మూడు టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు రెండు కప్పులు, నీళ్లు పావు కప్పు, నూనె, కారం రుచికి సరిపడినంత. మసాలా తయారీ కోసం : లవంగాలు: 7, చెక్క: 2 ఇంచులు, ఆవాలు: 1 టేబుల్ స్పూన్, మెంతులు: 1 టీ స్పూన్, ధనియాలు: 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర: 1/2 టీ స్పూన్.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా చికెన్‌ను రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. బోన్ లెస్ చికెన్ తీసుకోవాలి. దీని వలన పచ్చడి చాలా సులభంగా పెట్టొచ్చు. రుచి కూడా బాగుంటుంది. ఎప్పుడూ కూడా పచ్చడి పెట్టాలి అనుకున్నప్పుడు ఫ్రెష్ చికెన్ తీసుకోవాలి. అప్పటి కప్పుడే కోడిని కట్ చేసి ఇచ్చింది అయితే ఇంకా బెటర్.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో మనం మసాలా కోసం తీసుకున్న లవంగాలు,చెక్క,ఆవాలు, మెంతులు,ధనియాలు,జీలకర్ర వీటన్నింటిని పాన్‌లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, వీటిని మరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, సరిపడ ఆయిల్ వేసి చికెన్ ముక్కలను మంచిగా వేయించుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత దానిని వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్‌లో అదే ఆయిల్‌లో కప్పునర వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చా పచ్చగా దంచి ఆయిల్‌లో వేయాలి. అందులో కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ వేసి మంచిగా కలపాలి.

అవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కారం వేసి, చికెన్ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. అంతే టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. మరి మీరు కూడా ట్రై చేయండి.