
Sri Suvarchala Sametha Anjaneya Swamy Temple: అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి శ్రీ సువర్చలా దేవిల కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. కె. గంగవరం మండలం కోటిపల్లి గోదారి గట్టున ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. సతీసమేతంగా ఆంజనేయస్వామి కొలువై ఉండడం ఇక్కడ విశిష్టత, ప్రత్యేకత.

అది కాకుండా ఎక్కడ చూసినా ఆంజనేయస్వామి ఒక్కరే ఆలయాల్లో భక్తులకు కనిపిస్తారు.. కానీ, ఇక్కడ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అంటే సతీ సమేతంగా ఇక్కడ భక్తులకు ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఇది అరుదైన విషయం.

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు, అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు.

ఆంజనేయ స్వామివారి కల్యాణం జరగడం రాష్ట్రంలో ఇక్కడ ప్రత్యేకతని ఆలయ కమిటీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది పూర్వకాలం నుండి అనాదిగా వస్తున్న సాంప్రదాయమని ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు కోటిపల్లి భక్తులు.

ఈ ఏడాది మంగళవారం హనుమత్ జయంతి రావడంతో బుధవారం రాత్రి శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారికి కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కళ్యాణ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పప్పుల మసేను వెంకన్న ( రేవు శ్రీను ), ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.