
దక్షిణ భారతదేశంలో "తాళి" లేదా "తిరుమాంగళ్యం" అని పిలువబడే మంగళసూత్రం పొడవైన పసుపు దారం, లాకెట్టును కలిగి ఉంటుంది. ఇది తరచుగా అదృష్టానికి సంబంధించిన దేవతల చిత్రాలను కలిగి ఉంటుంది. ఇతర ప్రాంతాలలో ఇది నల్ల పూసలతో కూడిన హారము, బంగారు లాకెట్టు కావచ్చు.

మంగళసూత్రం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇది హిందూ సంస్కృతిలో వివాహంతో ముడిపడి ఉన్న లోతైన విలువలు నమ్మకాలను ప్రతిబింబిస్తుంది. వివాహం సమయంలో భర్త మూడు ముళ్లు వేసి కట్టిన మంగళసూత్రం స్త్రీ జీవితాంతం ఉంచుకుంటుంది.

ఐక్యత, నిబద్ధతకు చిహ్నం: మంగళసూత్రం రెండు ఆత్మల కలయికను సూచిస్తుంది. ఇది కలిసి జీవించడానికి నిబద్ధతను సూచిస్తుంది. హిందూ సంప్రదాయంలో దీనిని తరచుగా వివాహ ప్రమాణాలకు గుర్తుగా ధరిస్తారు.

రక్షణ, శుభం: సాంప్రదాయకంగా మంగళసూత్రాలు ముఖ్యంగా నల్ల పూసలు కలిగి ఉంటాయి. ఇవే దురదృష్టాన్ని, దుష్టశక్తులను దూరం చేస్తాయని, దంపతుల ఆనందాన్ని కాపాడుతుందని హిందువులు నమ్ముతారు.

రోజువారీ జ్ఞాపిక: ఇది వివాహ సమయంలో తీసుకున్న ప్రమాణాలను నిరంతరం గుర్తుచేస్తుంది. వైవాహిక బంధం పవిత్రతను నొక్కి చెబుతుంది. దీని కారణంగా వివాహ బంధం నిండు నూరేళ్లు కొనసాగుతుందని నమ్ముతారు.

భార్యభర్తల శ్రేయస్సుకు చిహ్నం: మంగళసూత్రం భర్త శ్రేయస్సుతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఇది భార్య ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా ఉంటూ దంపతులను ప్రేమ, సుఖశాంతులతో జీవించేలా చేస్తుంది.