
ఈ నెల(మే) 15న మేష రాశిలో అమావాస్య చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం రవి ఇక్కడ ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల, రాశ్యధిపతి కుజుడు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల, ఇక్కడ కుజ, చంద్రులు యుతి చెంది చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ అమావాస్య ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అమావాస్య ప్రభావం 14, 15, 16 తేదీల్లో మూడు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. సాధారణంగా అమావాస్య చెడు రోజే అయినప్పటికీ, మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు మాత్రం అదృష్టాన్ని కలిగించబోతోంది.

మేషం: ఈ రాశిలో రవి, చంద్ర, కుజులు కలవడం వల్ల ఈ అమావాస్యతో ఈ రాశివారి జీవితం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనుకోకుండా భారీగా ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు బాగా పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆదాయపరంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఆర్థిక అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి బయటపడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.

సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, చంద్ర, కుజుల కలయిక వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం కలుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో అమావాస్య ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగానికి సంబంధించిన ఏ వ్యవహారమైనా కలిసి వస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి.

ధనుస్సు: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, చంద్ర, కుజులు కలవడం వల్ల ఈ అమావాస్యతో ఈ రాశివారి దశ తిరుగుతుంది. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. విదేశీ సంబంధాలు కుదురుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, చంద్ర, కుజ గ్రహాలు కలుస్తున్నందువల్ల ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.