
మటన్.. అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు ఫుల్లుగా లాగించేస్తారు.. వాస్తవానికి మటన్ మంచిదంటారు ఆరోగ్య నిపుణులు.. మేక మాంసం అలాగే, మటన్ లోని లివర్, తలకాయ, కాళ్లు, తిల్లి, బ్రెయిన్ ఇలా అన్నింటిని మాంసాహార ప్రియులు ఇష్టపడుతుంటారు.. అయితే.. మేక తలకాయ కూర తింటే.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు డైటీషియన్లు.. మటన్ తలకాయ కర్రీ ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12, ఫాస్పరస్‌తో కూడిన అత్యంత పౌష్టికాహారం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ఇందులో కొవ్వు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అత్యంత ఎక్కువ బలాన్ని ఇస్తుంది.

మేక తలకాయ కూరను స్పైసీగా, రుచికరంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.. ఈ వంటకం అన్నం, రాగి సంగటి, రోటి వంటి వాటిలోకి అద్భుతంగా సరిపోతుంది. ఇది సంక్రాంతి, కనుమ పండుగలకు లేదా వారాంతపు స్పెషల్‌గా చేసుకోవచ్చు. ముందుగా తలకాయ ముక్కలను మంచిగా శుభ్రపరుచుకుని.. మసాలా పేస్ట్ తయారీతో మొదలుపెట్టాలి. ఒక మిక్సీ జార్‌లోకి మూడు టేబుల్‌స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, రెండు అంగుళాల దాల్చిన చెక్క, నాలుగైదు లవంగాలు, రెండు యాలకులు, ఒక టీస్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ గసగసాలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను తీసుకోవాలి. వీటన్నింటినీ కొద్దిగా నీరు చేర్చి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్‌ను ఉంచి, అందులోకి మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె బాగా వేడైన తర్వాత, ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించాలి. ఆ తర్వాత ఒకటిన్నర టేబుల్‌స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఇప్పుడు ఒక కిలో మేక తల మాంసాన్ని కుక్కర్‌లోకి చేర్చి, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి మధ్యస్థ మంటపై సుమారు 8-10 నిమిషాలు ఉడికించాలి. మాంసంలో నుంచి వచ్చిన నీరంతా ఇంకిపోయి, మాంసం డ్రైగా మారే వరకు వేయించుకోవాలి.

తరువాత, రుచికి తగినంత కారం (రెండు టేబుల్‌స్పూన్లు), ఒక టేబుల్‌స్పూన్ ధనియా పౌడర్, పావు టీస్పూన్ గరం మసాలా, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. మసాలాలు మాంసానికి బాగా పట్టేలా చూసుకున్న తర్వాత, మూత పెట్టి తక్కువ మంటపై ఐదు నుండి ఆరు నిమిషాలు, మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

చివరగా, కూర చిక్కదనానికి తగినంత నీటిని (సుమారు ఒక లీటరు) కలపాలి. ఉప్పు సరిచూసుకొని చివరి దశలో నీటితో పాటు వేయాలి. మూత పెట్టి అధిక మంటపై 10-12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే, ముక్కలు పర్ఫెక్ట్‌గా ఉడికి, కూర సరైన చిక్కదనంతో సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ కూర పల్చగా అనిపిస్తే, మరో ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. ముక్కలు ఉడకకపోతే, మరో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించవచ్చు. ఈ పద్ధతిలో తయారుచేస్తే స్పైసీ మేక తలకాయ కూర ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.