
చుక్క నూనె లేకుండా, మినపప్పు లేకుండా మెత్తటి దోసె చేసే మెత్తటి స్పాంజ్ దోసె చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని ఎలా తయారు చేయాలో, ఏమేం కావాలో ఇక్కడ తెలుసుకుందాం.. మర్మరాలు సుమారు 3 కప్పులు, బియ్యం ఒకటిన్నర కప్పు, అర టీ స్పూన్ మెంతులు, ఉప్పు తగినంత, నీళ్లు అవసరమైనంత తీసుకుంటే సరిపోతుంది. ఇందులో పెరుగు, వంట సోడా, ఈనో వంటివి చేర్చకుండానే మెత్తని దూదిలాంటి దోసె తయారు చేయవచ్చు.

బియ్యం, మెంతులను బాగా కడిగి ఒక పాత్రలో వేసుకోవాలి. ఇదులో నీళ్లు పోసి సుమారు 5 గంటలు నానబెట్టాలి. నానిన మిశ్రమాన్ని నీరు వంపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. అవసరమైనంత నీరు కలిపి దోసె పిండిలా జారుగా చేసుకోవాలి.

పిండిని కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మర్మరాలను ఒక గిన్నెలోకి తీసుకుని, నీళ్లు పోసి బాగా కడిగి.. మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పండిని కూడా దోసె పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని 8 గంటలపాటు పులియబెట్టాలి. పిండిని 6–8 గంటలు లేదా రాత్రంతా మూతపెట్టి ఉంచితే ఇంకా మెత్తటి దోసెలు వస్తాయి. తర్వాత అందులో కావల్సిన మేరకు ఉప్పు వేసుకుని దోసె వేసుకోవచ్చు.

వేడి తవాపై ఒక గరిటె పిండి పోసి దోసెలా పరచాలి. నూనె వేయకుండా మధ్యస్థ మంటపై మూత పెట్టి కాల్చాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత తీసి వేడివేడిగా వడ్డించాలి. దీనిలోకి టమాట చట్నీ వేసుకుంటే రుచి అదిరిపోతుంది.

ఇందులో మర్మరాలు ఎక్కువగా ఉండటం వల్ల దోసెలు చాలా మెత్తగా వస్తాయి. పిండి బాగా పులిస్తే హోటల్ స్టైల్ స్పాంజీ దోసెలు వస్తాయి. నాన్‌స్టిక్ పెనం వాడితే నూనె లేకుండానే సులభంగా తీసుకోవచ్చు. పిండిలో ఒక చిటికెడు చక్కెర వేస్తే దోసెలు మరింత బంగారు రంగులోకి వస్తాయి. ఈ రెసిపీతో వచ్చే దోసెలు చాలా మెత్తగా, స్పాంజీగా ఉండి పిల్లలు, ఇంట్లో పెద్ద వాళ్లు కూడా ఇష్టంగా తింటారు.