
పాము కాటు వేస్తే భయపడకూడదని వైద్యులు సూచించారు. పాముకాటుకు చికిత్స చేయడానికి అవసరమైన మందులు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పాముకాటుకు గురైన ప్రదేశంలో ధరించే ఉంగరాలు, కంకణాలు, గడియారాలు వంటి ఆభరణాలను వెంటనే తీసివేయాలి. శరీరం, కాటు పడిన ప్రదేశం కదలకుండా ఉంచాలని సూచించారు.

ముఖ్యం భయపడకూడదని.. భయపడటం వల్ల రక్తపోటు పెరిగి విషం వేగంగా వ్యాపిస్తుంది. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. కాటు వేసిన భాగాన్ని కదలకుండా ఉంచండి. ఇది విషం శరీరంలో వేగంగా పాకకుండా సహాయపడుతుంది.

చాలా మంది కాటు వేసిన చోట నీళ్లతో కడగడం లేదా సబ్బుతో రుద్దడం చేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పు. ఇలా చేయడం వల్ల డాక్టర్లు పాము రకం గుర్తించడంలో ఇబ్బంది పడతారు. అంతేకాకుండా విషం చర్మంపై ఎలా ఉన్నదీ వారికి తెలిసే అవకాశం పోతుంది.

కొంతమంది సినిమాల్లో చూసి పాము కరిచిన చోట విషాన్ని నోటితో పీల్చే ప్రయత్నం చేస్తారు. ఇది పెద్ద తప్పు. దీని వల్ల పీల్చే వ్యక్తికి ప్రమాదం కలుగుతుంది. ముఖ్యంగా నోట్లో గాయాలు ఉంటే.. విషం అతని శరీరంలోకి చేరే అవకాశం ఉంది.

ముఖ్యంగా పాము కాటు పడిన ప్రదేశంలో గట్టిగా ఏమీ కట్టకూడదని వైద్యలు తెలిపారు. ఆ ప్రదేశానికి సమీపంలో కోత పెట్టడం లేదా నోటితో పీల్చడానికి ప్రయత్నించడం చేయకూడదు. ఇలాంటి ప్రయత్నాలు సమయాన్ని వృథా చేయడమే కాకుండా ప్రమాదకరం. సమయం వృధా చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు నొక్కి చెప్పారు.