
ప్రముఖ స్టార్టప్ కంపెనీ కియా బయోటెక్‌తో కలిసి ఐఐటీ హైదరాబాద్ అత్యంత శక్తివంతమైన హైజెనిక్ శానిటైజర్‌ను ఆవిష్కరించింది.

ఒకసారి శానిటైజ్ చేస్తే ఏకంగా 35 రోజుల పాటు వైరస్ నుంచి రక్షణ ఇచ్చే ఈ శానిటైజర్‌ను కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు.

ఈ శానిటైర్ తయారీలో కీలక పాత్ర పోషించిన ఐఐటీ హైదరాబాద్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డీన్ ఎం శ్రీనివాస్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్‌మూర్తి, పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జ్యోత్న్సేందుగిరి, ఇతర పరిశోధకులను మంత్రి పోఖ్రియాల్ అభినందించారు.

డ్యూరోకియా పేరిట మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ శానిటైజర్ అమెజాన్ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. డ్యూరోకియా-హెచ్, ఎస్, ఎం, ఆక్వా పేర్లతో వేర్వేరుగా ఇవి లభిస్తున్నాయి.

ఈ శానిటైజర్ 120 సెకండ్లలోనే సూక్ష్మక్రిములను 99.99 శాతం అంతం చేయడంతో పాటు కొవిడ్-19 వైరస్ నుంచి కాపాడుతుంది. ఈ శానిటైజర్‌తో ఇంటిని శుభ్రం చేస్తే ఉపరితలంపై రక్షణపొర ఏర్పడుతుంది. అది 35 రోజులవరకు వైరస్‌లను దరిచేరనీయదు.

వైరస్‌లు ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించే ఫేస్‌మాస్క్‌ల కోసం డ్యురోకియా-ఎం శానిటైజర్‌ను తయారుచేశారు. ఈ శానిటైజర్‌తో ఒకసారి మాస్క్‌ను శుభ్రంచేస్తే మరింత రక్షణ పొందవచ్చు.