
రోటీ, చపాతీ, పుల్కా, పూరీ లేదా బగారా రైస్, బిర్యానీలోకి ఈ మసాలా గ్రేవీ కర్రీ అమృతతుల్యమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. 'అమ్మ చేతి వంట' శైలిలో పక్కా కొలతలతో ఈ కర్రీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.

ఈ గుత్తి టమాటా మసాలా కర్రీ తయారీకి ముందుగా ఒక పావు కేజీ చిన్న సైజు నాటు టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమెలు తీసి, విడిపోకుండా నాలుగు గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి.

మసాలా పేస్ట్ తయారీకి పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, అర టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, టీస్పూన్ గసగసాలు, టేబుల్ స్పూన్ జీడిపప్పు, 3 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీస్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

కడాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి గాట్లు పెట్టిన టమాటాలను వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 70 శాతం వరకు సాఫ్ట్‌గా మగ్గించి పక్కన తీసుకోవాలి. అదే బాండీలో 3-4 స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి వేయించిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి నూనె తేలేంత వరకు మగ్గించాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసి 2 నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, మగ్గించిన టమాటాలు, అర టీస్పూన్ గరం మసాలా, ముప్పావు కప్పు నీళ్లు పోసి మూతపెట్టి లో ఫ్లేమ్‌పై 5-10 నిమిషాలు ఉడికించాలి. చివరగా అర టీస్పూన్ బెల్లం పొడి, కసూరి మేథీ, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఘుమఘుమలాడే గుత్తి టమాటా మసాలా కర్రీ సిద్ధమవుతుంది.