
వరుణుదేవుడు కటాక్షం కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో గ్రామస్తులు, రైతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ, కర్నూలు జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వానల కోసం ఎదురుచూస్తూ రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. వర్షాధారిత పంటలపై ఆధారపడే చాలా మంది రైతులు విత్తనాలు వేసేందుకు సరైన వర్షం కోసం వేచి చూస్తుండగా, ఇప్పటికే వచ్చిన అరకొర వర్షాలకు విత్తనాలు వేసిన కొంతమంది రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

తగినంత తేమ లేక విత్తిన విత్తనాలు మొలకెత్తినప్పటికీ, ఆ చిగురుటాకులు కళ్ల ముందే వాడిపోతుండటంతో రైతులు విలవిలలాడుతున్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రకృతిని నమ్ముకున్న ఎర్రకోట గ్రామస్తులు, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించారు.

గ్రామ యువకులు, పెద్దలు కలిసి పవిత్రమైన పురాతన బావి నుండి 101 బిందెలతో నీటిని తోడారు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ, 'ఓం నమః శివాయ' నామస్మరణతో గ్రామంలో ఉన్న మొత్తం 18 దేవాలయాలకు ఆ జలాలను తీసుకెళ్లారు. ఆయా ఆలయాల్లోని శివలింగాలకు అత్యంత భక్తిశ్రద్ధలతో జలాభిషేకం నిర్వహించి, త్వరగా వర్షాలు కురిపించాలని కోరుకుంటున్నారు.

ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు వరుణ దేవుడిని వేడుకున్నారు. పంటల సాగు కోసం రైతులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావని, వర్షాలు కురిసి భూమి తడిస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ఎర్రకోట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.