
పూర్ణం కుడుములకు కావలసిన పదార్థాలు: అర కప్పు శెనగపప్పు, అర కప్పు బియ్యం పిండి, అర కప్పు బెల్లం తురుము, రెండు గ్లాసుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టేబుల్ స్పూన్ ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.

పూర్ణం కుడుముల తయారీ విధానం: ముందుగా, అర కప్పు పచ్చి శెనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పప్పును శుభ్రంగా కడిగి, కుక్కర్‌లోకి తీసుకోవాలి. అర కప్పు పప్పుకు ఒక కప్పు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత నీళ్లు లేకుండా వడకట్టి, పప్పును మాత్రమే మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని ఒక పాన్‌లోకి తీసుకుని, స్టవ్ ఆన్ చేసుకోవాలి.

అదే కప్పుతో అర కప్పు తురిమిన బెల్లాన్ని పప్పులో వేయాలి. బెల్లం పూర్తిగా కరిగి, పప్పు మిశ్రమం దగ్గరయ్యేంత వరకు చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలపవచ్చు.మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పప్పు మిశ్రమం ముద్దగా అయ్యే వరకు ఉడికించి, స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

ఒక పాన్‌లో ఒక కప్పు నీళ్లు తీసుకుని, కొద్దిగా ఉప్పు, పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నీళ్లు మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్‌ను తగ్గించి, అర కప్పు బియ్యం పిండి వేసి గరిటతో కలుపుతూ పిండిని ఉడికించాలి. పిండి దగ్గరపడిన తర్వాత మూత పెట్టి రెండు, మూడు నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికిస్తే పిండి మరింత గట్టిపడుతుంది. పిండి చల్లారిన తర్వాత చేతితో బాగా నలుపుతూ మెత్తని ముద్దగా చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి వస్త్రంతో లేదా మూతతో కప్పి ఉంచాలి.

సిద్ధం చేసుకున్న బియ్యం పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకుని చేతితో లేదా అరిటాకు, బట్టర్ పేపర్‌పై నెయ్యి రాసి, పిండిని పల్చగా వత్తుకోవాలి. మధ్యలో పూర్ణం ఉండను పెట్టి, పిండితో పూర్తిగా మూసి, ఉండలాగా లేదా మీకు నచ్చిన ఆకారంలో చుట్టుకోవాలి. గ్యాప్స్ లేకుండా చూసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండి, పూర్ణంతో కుడుములను తయారుచేసుకోవాలి. స్టవ్ మీద ఒక స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, మూత పెట్టి నీళ్లను మరిగించాలి. స్టీమర్ ప్లేట్‌లకు కొద్దిగా నెయ్యి రాసి, దానిపై సిద్ధం చేసుకున్న కుడుములను పేర్చాలి. మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఆవిరిలో ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత కుడుములు గట్టిపడి, ఉడికినట్లు అవుతాయి. స్టవ్ ఆపేసి, దానిని దించి చల్లారనివ్వాలి.