
ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకు సోమవారం కేబినెట్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఒక జిల్లా కేంద్రంను మరోక ప్రాంతానికి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే దానిపై ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలు డిసెంబర్ 31 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో బుధవారం నుంచి ఏపీలో మార్కాపురం జిల్లా, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

మార్కాపురం జిల్లాకు మార్కాపురం టౌన్ కేంద్రంగా ఉండనుండగా.. పోలవరం జిల్లాలకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది. ఇక అన్నమయ్య జిల్లాకు ఇప్పటివరకు జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండగా.. దానిని మదనపల్లెకు మార్చుతూ కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం కూడా రేపటి నుంచి అమలు చేయనున్నారు.

ఇప్పటివరకు ఏపీలో 26 జిల్లాలు ఉండగా.. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుతో ఆ సంఖ్య 28కి చేరుకుంది. ఇక రేపటి నుంచి కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను మార్చనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజన చేపట్టగా.. అందులో పొరపాట్లు ఉన్నాయని టీడీపీ ప్రభుత్వం ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపింది. అందుకు అనుగుణంగా ఇప్పుడు కొత్త జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల కేంద్రాల్లో మార్పులు చేసింది.