
పశ్చిమ బెంగాల్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర కోల్‌కతాలో భారీ రోడ్‌షో నిర్వహించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక తంతానియా కాళిబారిని సందర్శించారు. నగర నడిబొడ్డున ఉన్న ఈ పురాతన ఆలయంలో మా కాళీ మాత ఆశీస్సులు తీసుకోవడం ద్వారా బెంగాల్ సంస్కృతి, ఆధ్యాత్మికతతో తనకున్న విడదీయలేని అనుబంధాన్ని ప్రధాని మరోసారి చాటుకున్నారు.

ఈ ఆలయానికి కోల్‌కతా నగరం కంటే పురాతనమైన చరిత్ర ఉంది. 1703వ సంవత్సరంలో స్థాపించిన తంతానియా కాళిబారికి 300 ఏళ్లకు పైగా విశిష్ట చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన మా సిద్ధేశ్వరిని భక్తులు జాగ్రత్ దేవతగా అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు, నగర అభివృద్ధికి ముందే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసింది.

ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంసకు ఈ ఆలయంతో లోతైన అనుబంధం ఉంది. ఆయన తరచుగా ఇక్కడికి వచ్చి అమ్మవారి భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. "శంకరుని హృదయంలో కాళీ అమ్మవారు కొలువై ఉన్నారు" అనే అర్థం వచ్చే ఆయన అమృత వాక్కులు నేటికీ ఆలయ గోడలపై చెక్కబడి కనిపిస్తాయి. ఇది భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక ప్రేరణను ఇస్తుంది.

ఈ ఆలయ మరో ప్రత్యేకత ఇక్కడ సమర్పించే మాంసాహార నైవేద్యం. రామకృష్ణ పరమహంస తన శిష్యుడు కేశవ చంద్ర సేన్ ఆరోగ్యం కోసం కొబ్బరి బొండంలో వండిన రొయ్యలు సమర్పించిన నాటి నుండి ఈ ఆచారం కొనసాగుతోంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందేందుకు భక్తులు నేటికీ ఇక్కడ అమ్మవారికి మాంసాహార ప్రసాదాన్ని మొక్కుబడిగా సమర్పిస్తుంటారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రధాని మోదీ ఈ పర్యటన బెంగాలీ ప్రజల మనసులను గెలుచుకుందని చెప్పొచ్చు. బెంగాలీలు ప్రాణప్రదంగా భావించే కాళీ మాత ఆశీస్సులు తీసుకోవడం ద్వారా అటు ఆధ్యాత్మిక సందేశాన్ని, ఇటు రాజకీయంగా స్థానిక సంస్కృతి పట్ల తనకున్న గౌరవాన్ని మోదీ బలమైన రీతిలో చాటిచెప్పారు.