
కొందరు పాములను చూస్తే భయపడుతారో లేదో తెలియదు కాని.. ఇంట్లో బల్లులు కనిపిస్తే మాత్రం వణికిపోతుంటారు. ముఖ్యంగా ఇంటి గోడలపై ఆహారం ఉండే పదార్థాల్లో ఇవి ఎక్కవగా కనిపిస్తాయి. వీటిని ఇంట్లో నుంచి వెల్లగొట్టేందుకు జనాలు అనేక రసాయన మందులు వాడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా ఇంట్లోకి రాకుండా నివారించలేరు. కానీ మీ ఇంట్లో ఈ కొన్ని మొక్కలు ఉంటే బల్లులు అసలు ఆ దరిదాపుల్లోకి కూడా రావడానికి ఇష్టపడవు. ఈ మొక్కలు బల్లులకు ఎలాంటి హాని చేయవు, కానీ అవి తరచుగా ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల సహజంగానే బల్లులను ఇంట్లో నుంచి మనం వెల్లగొట్టవచ్చు.

రోజ్‌మెరీ: ఇంట్లో నుంచి బల్లులను తరిమికొట్టడానికి రోజ్‌మెరీ ఒక అద్భుతమైన మూలిక. దీని నుంచి వచ్చే బలమైన చెక్క వంటి వాసన బల్లులకు అస్సలు నచ్చదు. ఈ వాసన వాటికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి బల్లులు ఆ పక్కకు వచ్చే సాహసం చేయవు. ఇది కుండీలలో బాగా పెరుగుతుంది, దీనికి సూర్యరశ్మి కూడా అవసరం. కాబట్టి దీన్ని బాల్కనీలు లేదా కిటికీల దగ్గర పెంచవచ్చు. ఇది కీటకాలను పారద్రోలడమే కాకుండా, వంటలలో కూడా ఉపయోగపడుతుంది.

పుదీనా: బల్లులకు పుదీనా మొక్క ఇచ్చే బలమైన, ఘాటైన వాసన అంటే పవర చిరాకు. అందుకే ఆ వాసన వచ్చే చోటుకు వచ్చే ధైర్యం బల్లులు అస్సలు చేయవు. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ వాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బల్లులు ఎక్కువగా తిరిగే మూలల్లో లేదా తలుపుల దగ్గర పుదీనా మొక్కను ఒక కుండీలో పెట్టి ఉంచవచ్చు. ఇవి త్వరగా పెరుగుతాయి. మొక్కను అప్పుడప్పుడు కత్తిరించడం వల్ల అది మరింత వాసనను వెదజల్లుతుంది.

నీలగిరి: నీలగిరి మొక్కలలో సహజ నూనెలు ఉంటాయి, ఇవి బల్లుల వంటి అనేక జీవులకు నచ్చని తీవ్రమైన వాసనను వెదజల్లుతాయి. మీరు చిన్న యూకలిప్టస్ మొక్కలను బయట, సూర్యరశ్మి తగిలే చోట కుండీలలో పెంచవచ్చు. దాని ఘాటైన వాసన కీటకాలను దూరంగా ఉంచుతుంది, దీనివల్ల బల్లులు ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం తగ్గుతుంది. సరైన మోతాదులో సూర్యరశ్మి, అప్పుడప్పుడు కొమ్మలను కత్తిరించడం వల్ల ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

పెన్సిల్ కాక్టస్ : పెన్సిల్ మొక్క గట్టిగా ఉండటం, దానికి ఉండే జిగురు, రసాన్ని బల్లులు ఇష్టపడవు. అందుకే అవి దీనికి దూరంగా ఉంటాయి. ఈ మొక్క వెచ్చని ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. ఆశ్రయం కోసం వెతికే జంతువులు దీని జిగురు కారణంగా దీనిని ఇష్టపడవు. మీరు ఆ రసాన్ని నేరుగా తాకకూడదు, కాబట్టి ఈ మొక్కను తోటలు లేదా డాబాల వంటి బయటి ప్రదేశాలలో ఉంచడం ఉత్తమం. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు బల్లులను చంపకుండా సహాజంగానే ఇంట్లో నుంచి తరిమికొట్టవచ్చు.