
చర్మం, జుట్టు సంరక్షణలో చాలా మంది అధిక శ్రద్ధ కనబరుస్తుంటారు. ఇక గోర్ల సంరక్షణకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. స్టైలిష్ లుక్ కోసం గోళ్లపై నెయిల్ ఆర్ట్ చేస్తుంటారు. అందుక గోర్లు పొడవుగా పెంచుకుంటారు. కానీ సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల అవి మధ్యలోనే విరిగిపోతుంటాయి.

గోళ్లను ఎలా అలంకరించుకున్నా ముందుగా మేనిక్యూర్ చేయడం చాలా ముఖ్యం. మ్యానిక్యూర్ ద్వారా గోళ్లు అందంగా తయారవుతాయి. అయితే ఇందుకోసం బ్యూటీ పార్లలర్ వెళ్లి వందల, వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

చేతుల అందంగా మార్చుకోవాలంటే ముందుగా పాత నెయిల్ పాలిష్‌ను గోళ్ల నుంచి తొలగించాలి. నెయిల్ పాలిష్ రిమూవర్‌తో గోళ్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన ఆకృతిలో గోర్లు కత్తిరించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లను తీసుకుని అందులో షాంపూ వేసి, నిమ్మ చుక్కలు కొన్ని వేసుకోవాలి. రెండు చేతులను అందులో మూడు నిమిషాల వరకు ముంచి ఉంచుకోవాలి. ఇది గోరు క్యూటికల్‌ను మృదువుగా చేస్తుంది.

గోళ్లకు క్యూటికల్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోళ్ల మూలలో పేరుకుపోయిన మురికి శుభ్రం అవుతుంది. తర్వాత కాటన్ క్లాత్ లేదా టిష్యూతో గోళ్లను తుడుచుకోవాలి.

రెండు చేతులకు హ్యాండ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అయితే గోళ్లపై మాయిశ్చరైజర్ రాసుకోకూడదు. మాయిశ్చరైజర్ అంటుకుంటే నెయిల్ పాలిష్ గోళ్లకు అంటుకోదు. ముందుగా గోళ్లపై ట్రాన్పరెంట్ నెయిల్ పాలిష్ వేసుకోవాలి. జెల్ ఆధారిత నెయిల్ పాలిష్ కూడా ఉపయోగించవచ్చు. తర్వాత గోళ్లపై మీకు నచ్చిన నెయిల్ పాలిష్‌ను కలర్ అప్లై చేసుకుంటే సరి.