
ఆకుకూరలు: సాధారణంగా ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేసేవి అయినప్పటికీ వర్షాకాలంలో మాత్రం కొన్ని ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకూడదు. అందులో మెయిన్‌గా పాలకూర, మెంతులు, ఆవాలు కూరలతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆకుకూరలలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల, వాటిలో మురికి, బ్యాక్టీరియా, చిన్న పురుగులు చేరవచ్చు. కాబట్టి ఒక వేళ మీరు వీటిని తినాలి అనుకుంటే కచ్చితంగా శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తినండి. లేదంటే కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

వంకాయలు: వర్షాకాలంలో వంకాయల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఈ సీజన్‌లో వీటిలో పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి బయటకు తాజాగా కనిపించినప్పటికీ.. లోపల కుళ్ళిపోయి ఉండవచ్చు లేదా పురుగులతో నిండి ఉండవచ్చు. అటువంటి వంకాయను తినడం మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు, కాబట్టి కొనే ముందు పుచ్చులు ఉన్నాయా.. పురుగులు ఏమైనా ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసి కొనండి.

క్యాబేజీ, క్యాలీప్లవర్: వర్షాకాలంలో క్యాబేజీ విషయంలో కూడా అప్రమత్తత పాటించాలి. వీటి పొరల మధ్య చిన్న కీటకాలు, గుడ్లు, మట్టి సులభంగా దాక్కుంటాయి. కాబట్టి సరిగ్గా శుభ్రం చేయకుండా వండటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలీఫ్లవర్‌లో కూడా వర్షకాలంలో పురుగుల సమస్యల ఎక్కువగా ఉంటుంది.వీటి పువ్వుల మధ్య చిన్న చిన్ని కంటికి కనిపించని పురుగులు దాగి ఉంటాయి. పదేపదే కడిగినా కూడా అవి పూర్తిగా శుభ్రం కావు. కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్తగా పరిశీలించి కొనండి.

పుట్టగొడుగులు: పుట్టగొడుగులలో సహజంగానే తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో ఉండే తేమ కారణంగా ఇవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి సరిగ్గా నిల్వ చేయకపోతే, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి వర్షాకాలంలో మీరు మష్రుమ్స్ తినాలి అనుకుంటే.. ఎప్పటికప్పుడూ తాజావి మాత్రమే కొనండి.

వర్షాకాలంలో తినాల్సిన కూరగాయల విషయానికి వస్తే.. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బెండకాయ, గుమ్మడికాయ ,మునగకాయ వంటి తీగ జాతి, నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వర్షాకాలంలో వచ్చే జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి.