
మహారాష్ట్రలో మహదేవుడి దర్శనం మళ్లీ మొదలైంది. నెలల తరబడి ఎదురుచూస్తున్న శివభక్తుల నిరీక్షణకు తెరపడింది. పుణే సమీపంలోని ప్రసిద్ధ భీమాశంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం మళ్లీ తెరుచుకుంది. గత 5నెలలుగా మూతబడిన ఈ ఆలయం ఇప్పుడు మళ్లీ భక్తులకు దర్శనం కోసం అందుబాటులోకి వచ్చేసింది.సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ప్రకృతి సోయగాల నడుమ విలసిల్లుతున్న ఈ శివక్షేత్రం. ఇవాళ్టి నుంచి భక్తులకు పునఃదర్శన భాగ్యం కలిగిస్తోంది.

జ్యోతిర్లింగ క్షేత్రమైన మహారాష్ట్రలో.. త్రయంబకేశ్వర్ ఆలయం పరిసర ప్రాంతాల్లో సింహస్థ కుంభమేళా.. వచ్చే ఏడాది ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆ ఎఫెక్ట్ పురాతన క్షేత్రాలపైన పడింది. పనిలో పనిగా.. రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లోనూ విస్తృతమైన అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం. దీంతో, ఈ ఏడాది జనవరి నుంచి.. భక్తులకు భీమశంకర ఆలయంలోకి ఎంట్రీ లేకుండాపోయింది. సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు, భద్రతా ప్రమాణాలను పెంచేందుకు.. ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు అధికారులు.

ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. దర్శనం కోసం అవసరమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 5 నుంచే ప్రారంభమవడంతో వేలాది మంది శివభక్తులు ఆన్‌లైన్ దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తమ స్లాట్‌ను బుక్ చేసుకుని స్వామి సేవకు తరలివస్తున్నారు. తొలిరోజు పలువురు సెలబ్రిటీలు, పొలిటికల్ వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు.

ఇక, గత ఐదు నెలల కాలంలో ఆలయ ప్రాంగణంలో పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు అధికారులు. భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా రోడ్లను విస్తరించడంతో పాటు, భద్రతా ఏర్పాట్లను కూడా మరింత పటిష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ ఆలయం హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భీమాశంకర్ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో రద్దీ నిర్వహణ, భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలోపెట్టుకుని ఈ అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ఆలయం తిరిగి తెరుచుకోవడంతో భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని దర్శనానికి సిద్ధమవుతున్నారు.