
ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు, ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా, ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోందనే వాడన్ సైతం బలంగా వినిపిస్తుంది . మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి వంటి ప్రధాన ప్రాంతాల తో పాటు ఆటపాక పక్షుల కేంద్రంలో నో ఇదే దుస్థితి ఎర్పడటం ఆందోళన కలిగిస్తుంది.

వర్షాలు , వరదల సమయంలో పెద్దఎత్తున సమీప పట్టణాలు, నగరాల నుండి వస్తున్న మురుగునీరు మరియు పారిశ్రామిక వ్యర్థాలు. ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే ఈ కలుషిత జలాలు నేరుగా కొల్లేరు సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు సరస్సు పరిధిలో వెలిసిన అనధికార రొయ్యల, చేపల చెరువుల్లో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, పురుగుమందులు, కృత్రిమ మందుల వల్ల మిగిలి ఉన్న కొద్దిపాటి జలాలు కూడా పూర్తిగా విషతుల్యంగా మారుతున్నాయి. ఈ విషపూరిత నీటి ప్రభావంతో సరస్సులోని స్థానిక చేపల జీవవైవిధ్యం పూర్తిగా కనుమరుగవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరద ప్రవాహానికి వీలుగా కాలువలు పునరుద్దరించ్కపోవటం తో మట్టిమేట వేసి నిరు నిలబదతంలేదని ఇది తమ జీవిన విధానం పై దెబ్బతీస్తుందని కొల్లేరు ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) గతంలో పలుమార్లు కఠినమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ, ఆర్థిక బలంతో అక్రమార్కులు సరస్సు భూములను ఆక్రమించి ఆక్యు కల్చర్ చెరువులుగా మార్చేస్తున్నారు.

వేసవి కాలంలో లభించే కొద్దిపాటి సహజ జలాలను సైతం ఈ ప్రైవేట్ చెరువులకే మళ్లించడంతో సరస్సు సహజ నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. ఈ విధమైన దోపిడీ వల్ల కొల్లేరు ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. కొల్లేరు కాలుష్యం కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, సరస్సు చుట్టుపక్కల నివసించే పదుల సంఖ్యలోని గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ కలుషిత జలాలను వాడటం వల్ల స్థానికులు చర్మ వ్యాధులు, శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. పశువులు తాగేందుకు కూడా నీరు లభించని దుస్థితి నెలకొంది.

ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, అక్రమ ఆక్రమణలను తొలగించి, సరస్సులోకి మురుగునీరు చేరకుండా కట్టడి చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సరస్సులో ఏడాది పొడవునా కనీస నీటి నిల్వ ఉండేలా శాస్త్రీయంగా రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని, తద్వారా ఈ అంతర్జాతీయ పర్యావరణ సంపదను కాపాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు.