
హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఒక పురాతన జ్వాలాముఖి ఆలయం ఉంది. ఇది శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం దాని ప్రత్యేక లక్షణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాళ్ల మధ్య నుండి సహజంగా వచ్చే జ్వాలలు యుగాలుగా మండుతూనే ఉన్నాయి. ఇది సతీదేవి పిరుదులు పడిన ప్రదేశంగా ఖ్యాతి పొందినది. మరికొంతమంది సతీదేవి శరీరకలాల్లోని నాలుక తెగిపడిన ప్రదేశంగా భావిస్తారు. ఈ క్షేత్రం అష్టాదశశక్తి పీఠాలలో పదిహేనవదిగా పిలుస్తారు.

భారతదేశానికి వాయువ్యమూలంగా హిమవన్నగ పర్వత ప్రాంగణంలో ఒదిగిఉన్న ప్రదేశం హిమాచల్ ప్రదేశ్. హిమాచల ప్రదేశ్ ఉత్తర ప్రాంతమునందు కాంగ్రా జిల్లా ఉంటుంది. ఈ జిల్లా ముఖ్య కేంద్రంగా కాంగ్రా పట్టణం. దీనికి సుమారు 35 కి.మీ. దూరంలో జ్వాలాముఖి క్షేత్రం ఉంది..

ఇక్కడ బండరాళ్ల మధ్య నుండి సహజ వాయువు లీకేజీ కావడం వల్ల ఆలయ గర్భగుడిలో తొమ్మిది శాశ్వత జ్వాలలు మండుతున్నాయి. ఈ జ్వాలలు ఎటువంటి ఇంధనం లేదా నూనె లేకుండా మండుతున్నాయి. శతాబ్దాలుగా అలాగే మండుతున్నాయి. ఈ జ్వాలలు మాతా జ్వాలా దేవి వివిధ రూపాలను సూచిస్తాయని భావిస్తారు. కానీ, శాస్త్రీయ దృక్కోణంలో ఈ మంటలకు కారణం సహజ వాయువు లీకేజీ అని చెబుతారు. ఇది రాళ్ల మధ్య నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మండుతూనే ఉంటుంది. అయితే భక్తులకు ఇది ఆ అమ్మవారి అద్భుత శక్తికి సమానం అని నమ్ముతారు.

ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆలయంలోని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. అతను మంటపై నీరు పోసి, దానిపై ఒక ఇనుప షీట్‌తో కప్పును ఏర్పాటు చేశాడట. కానీ, మంట మండుతూనే ఉంది. దీంతో అక్బర్ కళ్లు అమ్మవారి మహిమను అర్థం చేసుకున్నాడని, ఆ దేవతకు బంగారు ఛత్రంను బహుమతిగా ఇచ్చాడట. అది ఇప్పటికీ ఆలయంలో ఉందని చెబుతున్నారు.

ఈ ఆలయం ఒక చిన్న కొండ ప్రాంతంలో ఉంది. దాని ప్రధాన ఆకర్షణ గర్భగుడిలో మండుతున్న జ్వాలలు. ఆలయ సముదాయంలో గోరఖ్నాథ్ ఆలయం, చౌహాన్ ఆలయం వంటి ఇతర చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆలయానికి సమీపంలో జ్వాలా కుండ్ అని పిలువబడే పవిత్ర చెరువు ఉంది. భక్తులు ఈ చెరువులో స్నానం చేస్తారు.