
పసుపులో ఏం కలుపుతున్నారు: మార్కెట్లో డిమాండ్‌ను బట్టి లాభాలు గడించడానికి కొందరు వ్యాపారులు పసుపును విపరీతంగా కల్తీ చేస్తున్నారు. పసుపుకు మంచి బ్రైట్ కలర్, సాఫ్ట్ టెక్స్చర్ రావడం కోసం ప్రాణాంతక రసాయనాలను వాడుతున్నారు. మెటానిల్ యెల్లో అనేది ఇది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదకరమైన సింథటిక్ రంగు. లెడ్ క్రోమేట్ అనేది ఒక రకమైన సీసం రసాయనం. ఇది శరీరంలోకి వెళ్తే నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. సుద్దపొడి, అడవి పసుపు, నాణ్యత లేని ముడి పదార్థాలను పసుపులో యథేచ్ఛగా కలిపేస్తున్నారు. కాబట్టి కేవలం రంగును చూసి పసుపును నమ్మడం మోసపోవడమే.

మీ ఇంట్లోని పసుపు అసలైనదేనా: పసుపు నకిలీదో, అసలైనదో తెలుసుకోవడానికి నిపుణులు కొన్ని సులభమైన చిట్కాలు సూచిస్తున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ పసుపు వేసి కదపకుండా కొన్ని నిమిషాలు వదిలేయండి. పసుపు గ్లాస్ అడుగున పేరుకుపోయి, పైనున్న నీరు లేత పసుపు రంగులో స్వచ్ఛంగా ఉంటే అది నిజమైన పసుపు. ఒకవేళ నీరు ముదురు పసుపు రంగులోకి మారి, పసుపు పూర్తిగా కరిగిపోతే అది కల్తీ పసుపు.

అరచేతి పరీక్ష : మీ అరచేతిలో చిటికెడు పసుపు వేసి, బొటనవేలితో 10 నుండి 20 సెకన్ల పాటు గట్టిగా రుద్దండి. అది అసలైన పసుపు అయితే మీ అరచేతిపై కేవలం లేత పసుపు మరక మాత్రమే మిగులుతుంది. కెమికల్స్ ఉంటే ముదురు రంగు అంటుకుంటుంది లేదా రంగు వెంటనే వెలిసిపోతుంది. ఈ రెండు టెస్టులు చాలా ఈజీగా చేసుకోవచ్చు.

మెటానిల్ యెల్లో పరీక్ష: ఒక టెస్ట్ ట్యూబ్‌లో కొంత పసుపు పొడి వేసి, దానికి కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి. ఆ ద్రావణం వెంటనే గులాబీ రంగులోకి మారితే, అందులో మెటానిల్ యెల్లో కలిపినట్లు అర్థం. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వికారం, అజీర్ణం వస్తాయి. పసుపును నీరు, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలిపినప్పుడు బుడగలు వస్తే, అందులో సుద్దపొడి కల్తీ జరిగినట్లు స్పష్టమవుతుంది.

నిపుణుల హెచ్చరిక: మనం పసుపును వంటల్లో తక్కువ పరిమాణంలోనే ఉపయోగించినప్పటికీ, అది కల్తీదైతే రోజురోజుకూ ఆ విషం శరీరంలో పేరుకుపోయి దీర్ఘకాలిక కాలేయ, మూత్రపిండాల వ్యాధులకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మార్కెట్లో పసుపు కొనేటప్పుడు కేవలం లూజ్ పౌడర్లను కాకుండా నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవాలని లేదా పసుపు కొమ్ములను తెచ్చి ఇంట్లోనే ఆడించుకోవడం ఉత్తమమని నిపుణులు అంగీకరిస్తున్నారు.