
శరీరంలో ప్రోటీన్ లోపం అనగానే మనకు గుర్తొచ్చేవి చికెన్, మటన్, చేపలు. జిమ్ వెళ్లే వారి నుండి డైట్ ప్లాన్ చేసే వారి వరకు అందరూ వీటినే సిఫార్సు చేస్తుంటారు. అయితే ఒకరి శరీరానికి సెట్ అయ్యే ఆహారం మరొకరికి హాని కలిగించవచ్చు అన్నది వాస్తవం. మాంసాహారం కేవలం రుచిని, ప్రోటీన్‌ను మాత్రమే కాకుండా.. శరీరంలో వేడి, కొలెస్ట్రాల్, అలెర్జీలు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చికెన్: హోలిస్టిక్ డైటీషియన్ డాక్టర్ గీతికా చోప్రా అభిప్రాయం ప్రకారం.. చికెన్ బ్రెస్ట్ బరువు తగ్గడానికి, డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుంది. కానీ దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చికెన్‌లో 'ప్యూరిన్లు' అధికంగా ఉంటాయి. ఇవి అరిగే క్రమంలో యూరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు చికెన్ తినకూడదు. మూత్రపిండాల సమస్య ఉన్నవారు కూడా చికెన్‌కు దూరంగా ఉండాలి.

మటన్: మటన్ రుచికరమైనదే కాదు ఇందులో ఐరన్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. కానీ మటన్‌లో కొవ్వు శాతం చాలా ఎక్కువ. గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు మటన్ తీసుకోకపోవడమే మంచిది అని డాక్టర్ రిషా శర్మ సూచిస్తున్నారు. మటన్‌ను ప్రతిరోజూ తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే తక్కువ నూనె, తక్కువ మసాలాలతో వండుకోవాలి.

చేపలు: మెదడు, గుండె ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వాపును తగ్గిస్తాయి. థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు ఉన్నవారికి ఇవి వరం. అయితే సముద్ర ఆహారం పడని వారు, అలెర్జీ ఉన్నవారు చేపలకు దూరంగా ఉండాలి. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు లేదా శరీరంలో పాస్పరస్ పరిమితి తక్కువగా ఉండాల్సిన వారు చేపలను తక్కువగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి.

ప్రోటీన్ కోసం కేవలం మాంసాహారంపైనే ఆధారపడటం కంటే మీ శరీర స్వభావాన్ని బట్టి ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ట్రెండ్‌ను బట్టి కాకుండా, వైద్యుల సలహాతో మీ డైట్ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.