
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో తోటి ప్రయాణికులకు ఓ వింత అనుభవం ఎదురైంది. ఓక్లాండ్ నుంచి శాన్ డియాగో వెళ్లాల్సిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఊహించని ప్రయాణికుడు ప్రత్యక్షమవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తనకంటూ ప్రత్యేకంగా ఓ టికెట్ కొనుగోలు చేసి, దర్జాగా సీట్లో కూర్చున్న ఆ ప్రయాణికుడు మనిషి కాదు. ఏకంగా 70 పౌండ్ల బరువున్న ఓ హ్యూమనాయిడ్ రోబో. ఊహించని ఈ పరిణామం వల్ల ఆ విమానం గంటకు పైగా ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది.

ఈ వింత రోబో పేరు 'బీబాప్' . ఎలైట్ ఈవెంట్ రోబోటిక్స్ సంస్థ ఈ హ్యూమనాయిడ్ రోబోను ఆపరేట్ చేస్తోంది. విమానం ఎక్కిన వెంటనే తోటి ప్రయాణికులను చూసి చేయి ఊపుతూ ఈ రోబో ఎంతో సందడి చేసింది. విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు చిన్నపాటి ప్రదర్శనతో అందరినీ అలరించింది. మనుషుల్లాగే దీనికి కూడా సీటు బెల్టు కట్టి భద్రంగా కూర్చోబెట్టారు.

అంతా సజావుగా సాగుతోందనుకుంటున్న తరుణంలో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి అనుమానం వచ్చింది. విమానంలో ఉన్న రోబోను నిశితంగా పరిశీలించిన సిబ్బంది.. దాని బ్యాటరీ, భద్రతా ప్రమాణాలపై ఆపరేటర్లకు ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. ఆ రోబోలో అమర్చిన లిథియం బ్యాటరీ పరిమాణం, విమానయాన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు వారు గుర్తించారు. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం విమానంలోకి అనుమతించే గరిష్ఠ బ్యాటరీ పరిమాణం కన్నా.. ఈ రోబో బ్యాటరీ చాలా పెద్దదిగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ భారీ బ్యాటరీతో విమాన ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేమని సిబ్బంది తేల్చి చెప్పారు. చివరికి విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆ లిథియం బ్యాటరీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. రోబోలో నుంచి ఆ బ్యాటరీని తొలగించిన తర్వాతే విమానం శాన్ డియాగోకు సురక్షితంగా బయలుదేరింది. విమానంలో చోటు చేసుకున్న ఈ మొత్తం వ్యవహారం వల్ల ప్రయాణికులు గంటకు పైగా విమానంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.

టెక్ ఈవెంట్ల కోసం ఇలాంటి రోబోలను ఒక నగర ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విమానాల్లో తీసుకెళ్లడం సాధారణ వ్యవహారంగా మారుతోంది.భవిష్యత్తులో ఇలాంటి హ్యూమనాయిడ్ రోబోలు సాధారణ ప్రయాణికులతో పాటు విమానాల్లో పక్క సీట్లలో ప్రయాణించే దృశ్యాలు మనం మరిన్ని చూసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి 'రోబో ప్రయాణికుల' కోసం ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు ఏవైనా ప్రత్యేక నిబంధనలు, మార్గదర్శకాలు తీసుకొస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.