
పోషకాల గని అయిన పాలకూరను వంటల్లో ఉపయోగించే ముందు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాలకూర ఆకులపై మట్టి, దుమ్ముతో పాటు కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా కడగని ఆకుకూరలను తినడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు, కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అందుకే వీటిని వండడానికి లేదా తినడానికి ముందు శుభ్రమైన పద్ధతుల్లో కడగడం చాలా ముఖ్యం.

పాలకూరను క్లీన్ చేయడానికి ఒక సులభమైన మార్గం ఉంది. ముందుగా ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని నింపుకుని, అందులో పాలకూర ఆకులను వేసి మెల్లగా కదిలించాలి. ఇలా చేయడం వల్ల ఆకులపై పేరుకుపోయిన మట్టి లూజ్ అయి కిందకు రాలిపోతుంది. ఆ తర్వాత ప్రతి ఆకును విడివిడిగా పారుతున్న నీటి కింద ఉంచి కడగాలి. దీనివల్ల ఆకులకు పట్టుకుని ఉన్న మిగిలిన దుమ్ము, సూక్ష్మక్రిములు పూర్తిగా తొలగిపోతాయి.

కేవలం కడగడమే కాకుండా కడిగిన తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. నీటి నుండి తీసిన పాలకూర ఆకులను ఒక శుభ్రమైన గుడ్డతో లేదా పేపర్ టవల్‌తో మెల్లగా తడి ఆరేలా తుడవాలి. గట్టిగా ఒత్తిడి పెడితే ఆకులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొన్ని ఆకులు వంగి లేదా ముడుచుకుని ఉంటాయి. అటువంటి ఆకుల మడతలలో మురికి, చిన్న కీటకాలు చిక్కుకుపోయే అవకాశం ఎక్కువ కాబట్టి కడిగేటప్పుడు ప్రతి మూలనూ నిశితంగా పరిశీలించి శుభ్రం చేయాలి.

పాలకూరను నిల్వ చేసే విషయంలో చాలామంది చేసే పొరపాటు.. మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్‌లో పెట్టడం. కానీ అలా చేయడం వల్ల అధిక తేమ కారణంగా ఆకులు త్వరగా కుళ్లిపోయి పాడవుతాయి. కాబట్టి పాలకూరను వండే ముందు మాత్రమే కడగడం ఉత్తమం. అలాగే ఎండిపోయిన, చిరిగిన లేదా జిగురుగా మారిన ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. ఎందుకంటే అటువంటి ఆకుల్లో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, మిగిలిన మంచి ఆకులను కూడా పాడుచేస్తుంది.

ఆకుకూరలను ముట్టుకునే ముందు మన వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఎంతో అవసరం. పాలకూరను తాకడానికి ముందే మన చేతులను సబ్బు, నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మన చేతుల ద్వారా ఆహారంలోకి ఇన్ఫెక్షన్లు చేరే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారమే కాదు, దాన్ని అంతే ఆరోగ్యకరమైన పద్ధతిలో వండుకుని తినడమే మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచుతుందని గమనించాలి.