
వంటల్లో కొత్తిమీర ఉంటే ఆ రుచే వేరు. కానీ చాలా మంది మార్కెట్ నుండి కొత్తిమీర తీసుకువచ్చిన వెంటనే నీటితో కడిగి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. కానీ అలా చేయడం వల్ల ఆకుల్లో నీరు, తేమ అలాగే నిలిచిపోయి కొత్తిమీర చాలా త్వరగా పాడైపోతుంది. అందువల్ల నిల్వ చేసే విధానంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ముందుగా కొత్తిమీర కట్టను విప్పి, అందులో పసుపు రంగులోకి మారిన, ఎండిన లేదా పాడైన ఆకులను వేరు చేసి పడేయాలి. వేర్లకు ఏమైనా మట్టి ఉంటే శుభ్రం చేసుకోవాలి. కొత్తిమీరను కడగకుండా నిల్వ చేయడం మంచిది. ఒకవేళ కడగాల్సి వస్తే మాత్రం, ఫ్రిజ్‌లో పెట్టే ముందు ఒక శుభ్రమైన కాటన్ గుడ్డపై లేదా కిచెన్ టవల్‌పై పరిచి పూర్తిగా ఆరిపోయేలా గాలికి ఆరబెట్టాలి.

టిష్యూ పేపర్‌ను ఉపయోగించి కొత్తిమీరను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. దీనికోసం పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని డబ్బాను తీసుకోవాలి. ముందుగా డబ్బా అడుగుభాగంలో ఒక పొడి టిష్యూ పేపర్‌ను పరచి, దానిపై కొత్తిమీర ఆకులను సమానంగా సర్దాలి. ఆకుల పైన మరోసారి టిష్యూ పేపర్ ఉంచి డబ్బా మూతను గట్టిగా మూసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి.

ఈ విధానంలో టిష్యూ పేపర్ కొత్తిమీరలోని అదనపు తేమను పూర్తిగా పీల్చుకుంటుంది. దీనివల్ల ఆకులు జిగటగా మారకుండా, కుళ్లిపోకుండా చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. చాలా మంది ప్లాస్టిక్ కవర్లలోనే కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దానివల్ల తేమ ఆవిరి కాక ఆకులు త్వరగా నల్లబడిపోతాయి. కాబట్టి ఎప్పుడూ పొడి డబ్బానే ఉపయోగించాలి.

అలాగే ప్రతి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి డబ్బాను తెరిచి టిష్యూ పేపర్‌ను పరిశీలించాలి. ఒకవేళ టిష్యూ తడిసిపోయి ఉంటే వెంటనే కొత్తది మార్చాలి. మధ్యలో ఏవైనా ఆకులు పాడవుతుంటే వాటిని వెంటనే తొలగించాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కొత్తిమీర వాడిపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రతిసారీ మార్కెట్‌కు వెళ్లే పని లేకుండా ఎక్కువ రోజులు చక్కగా ఉపయోగించుకోవచ్చు.