
బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇవే : మిల్క్ బ్రెడ్ 10 స్లైసులు, నూనె డీప్ ఫ్రై చేయడానికి సరిపడా, పంచదార 300 గ్రాములు, యాలకులు నాలుగు, నెయ్యి రెండు స్పూన్స్, జీడిపప్పు, బాదం, కిస్ మిస్, పాలు కాచి చల్లార్చినవి కప్పు సరిపోతాయి. వీటితో చాలా సులభంగా బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చును.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా, మిల్క్ బ్రెడ్ పది స్లైసులు తీసుకోవాలి. బ్రెడ్ నాలుగు వైపులా అంచులను కట్ చేయాలి. అంచులు తీసివేసిన తర్వాత, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. దానిపై పాన్ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను ఒక కడాయిలో వేసి వేడి చేయాలి.

నూనె వేడయ్యాక, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బ్రెడ్ ముక్కలను వేయాలి. అన్ని ముక్కలను ఒకేసారి కాకుండా, కడాయికి పట్టినన్ని వేసి రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన బ్రెడ్ ముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని చేతితో చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు, స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి, ఒక చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి వేడయ్యాక, జీడిపప్పు, బాదం కిస్‌మిస్‌లను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్‌లో ఒక గ్లాసు పంచదారకు ఒక గ్లాసు నీళ్లు పోసి, నాలుగు యాలకులు వేసి పాకం రానివ్వాలి. దీనికి ఎటువంటి తీగపాకం అవసరం లేదు. గులాబ్ జామున్ పాకం కంటే కొద్దిగా ఎక్కువ చిక్కగా వస్తే సరిపోతుంది. పాకం సిద్ధమయ్యాక, మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి.

బ్రెడ్ ముక్కలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పాకం పీల్చుకొని దగ్గరపడుతుంది. హల్వా దగ్గర పడిన తర్వాత, చిన్న గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేయాలి. అంతే బ్రెడ్ హల్వా రెడీ