
అన్ని కూరగాయలనూ ఒకే విధంగా నిల్వ చేయడం సరైన పద్ధతి కాదు. కొన్నింటిని చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశంలో ఉంచాలి, మరికొన్నింటికి మంచి గాలి వెలుతురు అవసరం. తేమ శాతం కూడా కూరగాయల తాజాదనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు మొదటగా ఏ కూరగాయలను ఎక్కడ నిల్వ చేయాలో తెలుసుకోవాలి.

బంగాళాదుంపలు, ఉల్లిపాయలు: బంగాళాదుంపలు, ఉల్లిపాయలను నిల్వ చేయడానికి సాధారణంగా ఫ్రిజ్ అవసరం లేదు.వీటిని పొడిగా, చీకటిగా, మంచి గాలి తగిలే ప్రదేశంలో ఉంచినా సరిపోతుంది. కానీ స్టోర్ చేసినప్పుడూ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా గాలి ఆడే బుట్టలు లేదా నెట్ బాస్కెట్లులో వీటిని పెట్టాలి. అయితే ఈ రెండింటినీ ఎప్పుడూ కలిపి ఉంచకూడదు. వాటి నుంచి వెలువడే తేమ, వాయువులు రెండూ త్వరగా కుళ్లిపోయేలా చేస్తాయి. కాబట్టి వీటిని విడివిడిగా ఉంచడమే ఉత్తమం.

ఇక టమాటాలు.. మీ దగ్గర బాగా పండిన టమాటాలు ఉంటే వాటిని సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయవచ్చు. నేరుగా ఎండ తగిలే చోట గానీ, గ్యాస్ పొయ్యి దగ్గర గానీ కాకుండా వంటింట్లో చల్లగా, పొడిగా ఉండే చోట ఉంచాలి. టమాటాల మీద బరువు పెట్టడం గానీ, నొక్కడం గానీ చేయకూడదు. ఎందుకంటే ఒత్తిడికి గురైతే అవి త్వరగా పాడైపోతాయి.

ఆకుకూరలను ఎలా భద్రపరచాలి?: కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు వేడి, అధిక తేమ వల్ల చాలా త్వరగా వాడిపోతాయి. కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పాడైపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వేరు చేసి.. ఆ తర్వాత వాటిని శుభ్రమైన కాటన్ గుడ్డలో గానీ, పేపర్‌లో గానీ కాస్త తేమ తగిలేలా చుట్టి, మంచి గాలి ఆడే ప్రదేశంలో ఉంచాలి.

అయితే ఎప్పుడూ కూడా ఆకుకూరలను మూసి ఉన్న ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. ఎందుకంటే లోపల అధిక తేమ పేరుకుపోయి ఆకులు త్వరగా కుళ్లిపోతాయి, కాబట్టి వాటికి గాలి తగిలేలా చూసుకోవడం ముఖ్యం. మీరు కూడా ఫ్రిజ్‌లో ప్లేస్ సరిపోనప్పుడూ ఈ చిట్కాలు ఉపయోగించి కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోండి.