
కానీ విత్తనాలు త్వరగా మొలకెత్తకపోవడం లేదా మొలకలు రాగానే నీరు ఎక్కువై పడిపోయి కుళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యలేమీ లేకుండా కేవలం 3 రోజుల్లో ధనియాలు మొలకెత్తించి, 20-25 రోజుల్లోనే ఏపుగా పెరిగే కొత్తిమీరను హార్వెస్ట్ చేసుకునే సరికొత్త పద్ధతిని ఇప్పుడు చూద్దాం.

ధనియాలు మొలకెత్తించే సరికొత్త పద్ధతి: ముందుగా పుచ్చు పట్టని కొత్త ధనియాలను ఎంచుకోవాలి. ఈ ధనియాలను పగలగొట్టాల్సిన అవసరం లేకుండా నేరుగా నీటిలో వేసి 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక మందపాటి కాటన్ క్లాత్ తీసుకుని నానిన ధనియాలను అందులో వేసి లూజ్‌గా మూట కట్టాలి. మూట తడిసేలా నీళ్లు చల్లి గాలి, వెలుతురు తగిలే నీడ ప్రదేశంలో ఉంచాలి. రోజుకు ఒక్కసారి మూటపై నీళ్లు చిలకరిస్తుంటే చాలు.. కేవలం 3 నుండి 4 రోజుల్లోనే ప్రతి విత్తనం నుంచి బలమైన తెల్లని వేర్లు, లేత ఆకులు బయటకు వస్తాయి.

మట్టి మిశ్రమం & నాటే విధానం: టబ్బులో డ్రైనేజ్ హోల్స్ పెట్టి 50% గార్డెన్ సాయిల్ (మట్టి), 50% మేక ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, ఒక చెంచా వేపపిండి కలిపి పాటింగ్ మిక్స్ సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి ఆకుకూరలు వేసేటప్పుడు మట్టిలో కోకోపీట్ కలపకూడదు. కోకోపీట్ వల్ల మట్టి మరీ లూజ్ అయి నీళ్లు పోయగానే లేత మొలకలు నేలవాలిపోతాయి.

టబ్బులో మట్టి నింపి, మొలకెత్తిన ధనియాలను ఒత్తుగా చల్లాలి. మొక్కలు ఒకదానికొకటి సపోర్ట్‌గా ఉండి పడిపోకుండా ఉండటానికి ఒత్తుగా చల్లడం మంచిది. పైన అర అంగుళం మట్టి పొరను కప్పి తేలికగా నీళ్లు చిలకరించాలి. 2-3 రోజులు సెమీ షేడ్‌లో ఉంచి ఆ తర్వాత ఎండ తగిలే ప్రదేశానికి మార్చాలి.

మొక్కలు పడిపోకుండా 'డిస్పోజబుల్ గ్లాస్' సీక్రెట్ ట్రిక్: చిన్న మొలకలపై నేరుగా నీళ్లు పోస్తే అవి పడిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఒక ప్లాస్టిక్ లేదా పేపర్ డిస్పోజబుల్ గ్లాస్‌కు చుట్టూ రంధ్రాలు చేసి టబ్బు మధ్యలో మట్టిలో దింపాలి. మనం పోసే నీళ్లు లేదా బియ్యం కడిగిన నీళ్లను ఆ గ్లాస్‌లో పోస్తే.. రంధ్రాల ద్వారా తేమ నెమ్మదిగా అన్ని మొక్కల వేర్లకు సమానంగా అందుతుంది. ఈ సులువైన పద్ధతి పాటిస్తే కేవలం 20 నుండి 25 రోజుల్లోనే మీ ఇంట్లోనే పచ్చని, సువాసనభరితమైన కొత్తిమీర కోతకు సిద్ధమవుతుంది!