
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా గులాబ్ జాము పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుని, కొద్దికొద్దిగా కాచి చల్లార్చిన పాలు లేదా నీటిని కలుపుతూ ఉండాలి. ఇందులోనే ఒక టీస్పూన్ నెయ్యి లేదా ఆయిల్ కూడా కలపాలి. పిండిని చాలా సున్నితంగా, సాఫ్ట్‌గా పిండిని ముద్దలా కలపాలి. ఇలా కలపడం వల్ల గులాబ్ జామున్‌లు మృదువుగా వస్తాయి. పిండి ముద్దలా తయారయ్యాక, దానిని మూత పెట్టి కనీసం 10 నిమిషాలు పక్కన పెట్టాలి.

పిండి సెట్ అయ్యేలోపు, తీపి పాకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒక కప్పు గులాబ్ జామున్ పిండి మిశ్రమానికి రెండున్నర నుండి మూడు కప్పుల పంచదారను తీసుకోవాలి. దీంతో పాటు మూడు కప్పుల నీటిని కలిపి స్టవ్‌పై పెట్టాలి. పాకం మరీ తీగ పాకం రానవసరం లేదు. చక్కెర పూర్తిగా కరిగి, పాకం మరగడం ప్రారంభించిన తర్వాత, మరో ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగించాలి. చివర్లో, రెండు లేదా మూడు యాలకులను పాకంలో వేయాలి. పాకం బాగా మరిగిన తర్వాత, కొద్దిగా నిమ్మరసాన్ని కలపడం చాలా ముఖ్యం. నిమ్మరసం కలపడం వల్ల పాకం తిరిగి గడ్డ కట్టకుండా ఉంటుంది. పాకం సిద్ధమయ్యాక, గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచండి.

ఇప్పుడు, సెట్ అయిన పిండిని తీసుకుని గులాబ్ జామున్ ఉండలను తయారు చేయాలి.పగుళ్లు లేకుండా ఉండలను తయారు చేయాలి. చాలా సున్నితంగా గుండ్రంగా చేయాలి. ఇలా చేయడం వల్ల ఉండల పైన పగుళ్లు రాకుండా, నునుపుగా వస్తాయి. పిండి మొత్తాన్ని ఇలాగే ఉండలుగా తయారు చేయాలి.

తయారు చేసిన గులాబ్ జామున్ ఉండలను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ సిద్ధం చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో గులాబ్ జామ్ ఉండలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా కాలిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. వేయించిన గులాబ్ జామున్‌లను పాకంలో వేసేటప్పుడు, పాకం కాస్త గోరువెచ్చగా ఉండాలి.

అన్ని గులాబ్ జామున్‌లను వేయించిన తర్వాత, గోరువెచ్చని పాకంలో వేసి 20 నుండి 30 నిమిషాలు నాననివ్వాలి. అప్పుడే అవి పాకాన్ని పీల్చుకుని, మెత్తగా, రుచికరంగా ఉంటాయి.అంతే ఇక టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. మీ కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా వీటిని తినవచ్చును.