
రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన తెలిపారు. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

బుధవారం రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44 డిగ్రీలు మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 19, పార్వతీపురంమన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, పోలవరం 4, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 1 మండలం, ఇలా మొత్తం 46 మండలాల్లో తీవ్రవడగాలులు, 73 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 4, పోలవరం జిల్లాలో 7, అనకాపల్లిలో 4, కాకినాడ జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 13, ఏలూరు జిల్లాలో 7, ఎన్టీఆర్ జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో 16, మార్కాపురం జిల్లాలో 4, ప్రకాశం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 2 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరి, నంద్యాల జిల్లా సంజామల 44. 2 డిగ్రీలు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.8 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43 డిగ్రీలు, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా దుర్గిలో 42.8 డిగ్రీలు, శ్రీసత్యసాయి జిల్లా తలుపులలో 42.8 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లెలో 42.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పరపాడులో 42 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో41.1 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నగరిలో 41 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఇక తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురు వారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణ ఉండే అవకాశం ఉందని. తర్వాత రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.