మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణం ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ గుండె సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయస్సులోనే చాలా మందికి గుండె పోటు వస్తుంది. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోడానికి వివిధ ఆరోగ్య విధానాలను పాటిస్తున్నారు. గుండె ఆరోగ్యం మెరుగుపర్చుకోవడం మంచిదే అయినా కొన్ని అపోహల కారణంగా తీసుకునే జాగ్రత్తలు గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. క్రమేపి గుండె సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం విషయంలో అపోహలేంటో ఓ సారి తెలుసుకుందాం
గుండె వ్యాధి నిర్ధారణైన తర్వాత చాలా మంది శారీరక శ్రమ చేయకుండా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తారు. అది చాలా తప్పని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచి ఆరోగ్యం ఉండేలా చేస్తుంది.
గుండె జబ్బులున్న వారు మందులు వేసుకుంటే సమస్య తీరిపోయిందనుకుంటారు. ఇది కూడా అబద్ధమే. స్టాటిన్స్ కాలేయంలో ఉత్పత్తయ్యే కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తాయి. అందువల్ల శరీరంలో కొవ్వు ధమనుల్లో పేరుకుపోకుండా చూస్తుంది. మందులు వేసుకుని చెడు కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తింటే సమస్య మళ్లీ ముందుకొస్తుంది.
మనలో చాలా మంది వయస్సు పెరిగితే రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని అనుకుంటారు. అయితే మారిన జీవన శైలి వల్ల అందరికీ ఈ సమస్య సాధారణంగా మారింది. వృద్ధాప్యంలో ధమనులు గట్టి పడడం వల్ల గుండె రక్తాన్ని గట్టిగా పంప్ చేయడానికి బలవంతం చేస్తుంది. తద్వారా రక్తపోటు పెరుగుతుంది.
గుండె సమస్యలున్న కేవలం ఉడకబెట్టిన ఆహారాన్ని తినాలని సూచిస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ చర్యలు వ్యక్తి ఆకలిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇలాంటి వారు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే ఆహార పదార్థాలను పక్కనబెట్టి మిగిలిన ఆహారాన్ని మితంగా తినవచ్చు.
చాలా మంది మొదటి సారి గుండె పోటు పెద్దగా ప్రమాదం లేదని చెబుతుంటారు. అయితే ఇది కూడా అపోహ మాత్రమే. మన శరీరతత్త్వం బట్టి వైద్యుల సూచన మేరకు మనం వ్యవహరించాలి తప్ప ఇలాంటి మాటలు విని వైద్యసాయం కోసం వెళ్లడం మానకూడదు. ఒక్కోసారి మొదటి గుండె పోటు శరీరం మనకిచ్చే హెచ్చరికలాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు.
గుండె పోటు జన్యు సంబంధిత వ్యాధి అని తల్లిదండ్రులకు వస్తే కచ్చితంగా నాకు వస్తుందని కొంతమంది అనుకుంటుంటారు. ఇందులో ఎలాంటి నిజం లేదు. తరచూ వైద్యులను సంప్రదిస్తూ, శారీరక శ్రమను చేస్తూ, ధూమపానం, మద్యపానం తగ్గించి, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.