
శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడంలో విటమిన్ సి పాత్ర అత్యంత కీలకం. చర్మ సౌందర్యాన్ని కాపాడాలన్నా, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందాలన్నా ఈ పోషకం తప్పనిసరి. సాధారణంగా విటమిన్ సి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నారింజ పండు. అయితే వాస్తవానికి నారింజ కంటే జామకాయలోనే ఈ విటమిన్ అత్యధికంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, 100 గ్రాముల నారింజలో 53 మి.గ్రా. విటమిన్ సి ఉంటే, అదే పరిమాణంలోని జామకాయలో ఏకంగా 228 మి.గ్రా. ఉంటుంది. అంటే ఒక జామకాయలోని పోషకాలు సుమారు నాలుగు నారింజ పండ్లతో సమానం.

జామకాయ కేవలం విటమిన్ సి మాత్రమే కాకుండా ఫైబర్ విషయంలో కూడా నారింజ కంటే రెండింతలు మెరుగ్గా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా జామకాయకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూనే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే జామకాయను తొక్క తీయకుండా తినడం వల్ల పూర్తిస్థాయి ప్రయోజనాలు అందుతాయి.

మరోవైపు నారింజ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ లభిస్తుంది. ముఖ్యంగా వేసవి, ఉక్కపోత సమయాల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు నారింజ ఉత్తమ ఎంపిక. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి నారింజలోని పోషకాలు తోడ్పడతాయి.

జామకాయను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బాగా పండిన కాయల కంటే మధ్యస్థంగా ఉన్న జామకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రాత్రిపూట జామకాయ తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, పగటిపూట లేదా భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే రోజుకు ఒక జామకాయ తినడం గొప్ప ఆరోగ్య సూత్రం.

మన దేశంలో జామ, నారింజ రెండు పండ్లూ తక్కువ ధరకే, సులభంగా లభిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి అద్భుతమైన మార్గాలు. శరీర అవసరాలను బట్టి త్వరగా విటమిన్ సి పెంచుకోవాలనుకునే వారు జామకాయను, హైడ్రేషన్, గుండె ఆరోగ్యం కోసం చూసేవారు నారింజను తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఏది ఏమైనా, ప్రతిరోజూ ఏదో ఒక పండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.