
మన దైనందిన ఆహారంలో నారింజ పండుకు ఉన్న క్రేజే వేరు. తియ్యగా, పుల్లగా ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ప్రశాంతతను పొందుతుంది. అంతేకాకుండా దీనిలోని పొటాషియం, ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటుని నియంత్రణలో ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. సులభంగా లభించే ఈ పండు రోజువారీ స్నాక్‌గా తినడానికి చాలా అనువుగా ఉంటుంది.

మరోవైపు జామపండును కేవలం ఒక సాధారణ పండుగా కొట్టిపారేయలేం. దీనిని పోషకాల గని అని పిలవవచ్చు. జామలో విటమిన్ సీ మాత్రమే కాకుండా అద్భుతమైన పీచు పదార్థం, టీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు సీజనల్ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడటంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక అసలు పోలిక విషయానికి వస్తే.. విటమిన్ సీ పరిమాణంలో జామపండు, నారింజ కంటే ఎంతో ముందంజలో ఉంది. పోషకాహార గణాంకాల ప్రకారం 100 గ్రాముల నారింజ పండులో సుమారు 53 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటే, అదే 100 గ్రాముల జామపండులో ఏకంగా 228 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే ఒక నారింజ పండు కంటే జామపండులో నాలుగు రెట్లకు పైగా విటమిన్ సి లభిస్తుంది. ఒకే ఒక్క జామపండు తింటే మన శరీరానికి రోజుకు కావలసిన విటమిన్ సి అవసరం పూర్తిగా తీరిపోతుంది.

అయితే ఏ పండును ఎంచుకోవాలి అనే సందేహం చాలామందికి రావచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్ సి పొందడం మీ లక్ష్యమైతే జామపండు ఖచ్చితంగా ఉత్తమమైన ఎంపిక. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను తట్టుకోవడానికి జామ ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం, తక్షణ ఉత్తేజం మరియు శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవడానికి నారింజ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కాకుండా రెండింటినీ సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవడమే తెలివైన పని. జామ, నారింజలు రెండూ తమదైన రీతిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి సీజన్‌ను బట్టి ఈ రెండు పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సమగ్రమైన పోషణను పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు.