
అల్లం టీ: అల్లంలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అల్లంలోని జింజెరాల్స్ కీళ్ల వాపును, నొప్పిని తగ్గిస్తాయి. ఉదయాన్నే కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

దగ్గు, జలుబు: చలికాలంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాధిస్తున్నప్పుడు అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, మంట లేదా జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారికి అల్లం టీ మంచి ఎంపిక. శారీరక అలసటను తగ్గించడంలో ఇది ముందుంటుంది.

లెమన్ టీ శరీరంపై అల్లం కంటే భిన్నంగా పనిచేస్తుంది. లెమన్ టీ వాసన మనసును ప్రశాంతపరుస్తుంది. రోజంతా పని ఒత్తిడితో టెన్షన్‌గా ఉండేవారికి ఇది చాలా మేలు చేస్తుంది.

బరువు తగ్గడం: శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో నిమ్మ టీ కీలకంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, చర్మ సమస్యలు ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు. సరిగ్గా నిద్రపట్టని వారికి, తల భారంగా అనిపించేవారికి లెమన్ టీ ఉపశమనాన్ని ఇస్తుంది.

ఏది ఎప్పుడు తాగాలి?: ఈ రెండింటిలో ఏది గొప్పదనే దానికంటే మీ శరీర అవసరాలను బట్టి ఎంచుకోవడం ఉత్తమం. మీకు జలుబు ఉన్నా లేదా ఒళ్లు నొప్పులుగా ఉన్నా అల్లం టీ తాగండి. మీరు ఫ్రెష్‌గా ఉండాలనుకున్నా లేదా అధిక ఒత్తిడిలో ఉన్నా లెమన్ టీ ఎంచుకోండి.

తయారీలో తప్పులు: చాలామంది టీని ఎక్కువసేపు మరిగిస్తుంటారు. దీనివల్ల టీ చేదుగా మారడమే కాకుండా అల్లం లేదా నిమ్మలోని పోషకాలు నశిస్తాయి. నీరు మరిగే చివరి దశలో అల్లం లేదా నిమ్మకాయ రసం వేసి, కేవలం రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే రుచితో పాటు పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.