
గ్యాక్ ఫ్రూట్ ఒక పోషకాల గని. 100 గ్రాముల గ్యాక్ ఫ్రూట్‌లో సుమారు 43 కిలో క్యాలరీలు, 9 గ్రాముల పిండి పదార్థాలు, 0.8 గ్రాముల ప్రోటీన్, తక్కువ కొవ్వు (0.09 గ్రాములు), 1 గ్రాము ఫైబర్, 20-25 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. అయితే, దీనిలోని ప్రధాన ఆకర్షణ బీటా కెరోటిన్, లైకోపిన్. బీటా కెరోటిన్ శరీరానికి రోజుకు అవసరమైన దానికంటే 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. ఇది కాలేయంలో విటమిన్ ఎగా మారి కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. లైకోపిన్ (300-500 మైక్రో గ్రాములు) శరీరానికి అవసరమైన దానికంటే 10 రెట్లు అధికంగా ఉండి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

గ్యాక్ ఫ్రూట్ కంటి సంరక్షణకు అత్యంత ప్రయోజనకారి. ఇందులో అధిక మొత్తంలో ఉండే బీటా కెరోటిన్, లైకోపిన్ కంటి ఆరోగ్యానికి నంబర్ వన్ ప్రయోజనాన్ని అందిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో కంటి లోపల ఉండే మాక్యులా దెబ్బతినకుండా రక్షించడంలో ఇది సహాయపడుతుంది. కంటి చూపు మసకబారడం, దెబ్బతినడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు కావడంతో, డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని నిస్సందేహంగా తీసుకోవచ్చు. గ్యాక్ ఫ్రూట్ రెటీనాకు బేస్ లేయర్‌లను బలోపేతం చేసి, రాడ్స్, కోన్స్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. రెటీనా కణాలకు పోషకాలను అందించి, మైటోకాండ్రియాను సక్రియం చేయడం వలన శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. కంటి రక్తనాళాలను విస్తరించి, కంటికి, ముఖ్యంగా రెటీనాకు రక్త ప్రసరణను బాగా పెంచుతుంది.

కంటి లెన్స్‌లోని ప్రొటీన్‌ను డ్యామేజ్ కాకుండా రక్షించడం ద్వారా క్యాటరాక్ట్‌లు రాకుండా నివారించడంలో గ్యాక్ ఫ్రూట్ తోడ్పడుతుంది. గ్యాక్ ఫ్రూట్ రుచిలో పనస పండు అంత తియ్యగా ఉండదు. దీనిని నేరుగా తినడానికి ఇబ్బంది పడేవారు జ్యూస్‌గా చేసుకోవచ్చు. ఇతర పండ్ల రసాలతో కలిపి తీసుకోవడం, ఇంకా సలాడ్‌లపై వేసుకోవడం వంటి పద్ధతుల్లో దీనిని సేవించవచ్చు.

ఒక గ్యాక్ ఫ్రూట్ అర కిలో నుండి కిలో వరకు బరువు ఉంటుంది. ప్రస్తుతం, ఇది మార్కెట్లో సుమారు రూ.300- రూ.500 వరకు లభ్యమవుతోంది. కొనుగోలు చేసిన తర్వాత, కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచి ఒకటి రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. కాలేయం డీటాక్సిఫికేషన్‌కు, యాంటీఆక్సిడెంట్‌గా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. మెదడు, కాలేయంలోని మైటోకాండ్రియాను ఉత్తేజపరచి, శక్తి ఉత్పత్తిని పెంచుతుంది.