
ఉల్లిపాయలు, వెల్లుల్లి: ఇవి కుక్కలకు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే థియోసల్ఫేట్ అనే రసాయనం కుక్కల శరీరంలోని ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఫలితంగా కుక్కలు తీవ్రమైన రక్తహీనత, బలహీనతకు గురవుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయల కంటే వెల్లుల్లి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరమని మర్చిపోవద్దు.

పుట్టగొడుగులు: మనం ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్స్ కుక్కల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇవి కుక్కల శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరును అస్తవ్యస్తం చేస్తాయి. కొన్నిసార్లు ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు.

పచ్చి టమాటాలు: బాగా పండిన టమాటాలు తక్కువ మొత్తంలో ఇస్తే పర్వాలేదు కానీ పచ్చి టమాటాలు, వాటి ఆకులు, కాండం కుక్కలకు విషపూరితం. వీటిలో ఉండే సోలనిన్ వల్ల కుక్కలకు గుండె సమస్యలు, అజీర్ణం తలెత్తుతాయి.

ఐస్ క్రీం: కుక్కలు ఐస్ క్రీంలోని లాక్టోస్‌ను జీర్ణం చేసుకోలేవు. దీనివల్ల వాటికి విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. డెయిరీ ఉత్పత్తులకు బదులు కుక్కలకు సరిపడే ప్రత్యేకమైన ఫ్రోజెన్ ట్రీట్స్ ఇవ్వడం ఉత్తమం.

ఉప్పు - ఆల్కహాల్: చిప్స్ లాంటి ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు కుక్కలలో సోడియం అయాన్ విషప్రయోగంకు కారణమవుతాయి. ఇక ఆల్కహాల్ విషయానికి వస్తే.. అది కుక్కలను కోమాలోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది.