
మీరు ఇంట్లో, బయట పెంచే మొక్కల కోసం వాడిన అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగించవచ్చునని తెలిస్తే షాక్ అవుతారు.. ఇది మీ మొక్కలను రక్షించడంలో సహాయపడటమే కాకుండా, తోటపనిని సులభతరం చేస్తుంది. అల్యూమినియం ఫాయిల్ మొక్కలకు ఎరువుగా పనిచేయకపోయినా, మొక్కలకు రక్షణగా నిలుస్తూ గార్డెనింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. అల్యూమినియం ఫాయిల్‌తో మొక్కలను సంరక్షించుకునే 4 సులువైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

మొక్కలకు కాంతి ప్రతిబింబింపజేయడం: చలికాలంలో లేదా వెలుతురు తక్కువగా ఉండే గదుల్లో ఉండే ఇండోర్ మొక్కలకు సరిపడా ఎండ తగలక ఆకులు ఎండిపోతుంటాయి. ఇలాంటి సమయంలో అల్యూమినియం ఫాయిల్‌ను కుండీ వెనుక భాగంలో లేదా కింద అమర్చితే, అది కాంతిని ప్రతిబింబించి మొక్కల ఆకులకు సమానంగా ఎండ తగిలేలా చేస్తుంది.

పురుగులు, కీటకాలను పారద్రోలడం: అల్యూమినియం ఫాయిల్ నుండి వచ్చే మెరుపు చిన్న చిన్న కీటకాలను, పురుగులను భయపెడుతుంది. గార్డెన్‌లో లేదా చిన్న కుండీల వద్ద ఫాయిల్ ముక్కలను ఉంచడం వల్ల హానికరమైన కీటకాలు మొక్కల దరిదాపుల్లోకి రావు. రసాయన క్రిమిసంహారకాలకు బదులుగా ఇది సహజమైన, సురక్షితమైన మార్గం.

వేసవిలో వేర్లను వేడి నుండి కాపాడటం: వేసవి కాలంలో ముదురు రంగు కుండీలు ఎండ తీవ్రతకు బాగా వేడెక్కుతాయి. దీనివల్ల కుండీలోని మట్టి ఉష్ణోగ్రత పెరిగి, మొక్కల వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యను నివారించడానికి కుండీల బయటి భాగంలో అల్యూమినియం ఫాయిల్‌ను చుట్టాలి. ఇది సూర్యరశ్మిని పరావర్తనం చెందించి, వేర్లు చల్లగా ఉండేలా చూస్తుంది.

వాటరింగ్ ఫన్నెల్ గా ఉపయోగం: హ్యాంగింగ్ పాట్స్ లేదా చిన్న కుండీలలో నీరు పోసేటప్పుడు నీళ్లు బయటకు చిందిపోతుంటాయి. దీనికోసం వాడిన ఫాయిల్‌ను గరాటు ఆకారంలో మలిచి నీరు పోస్తే, నీరు నేరుగా మట్టిలోకి వెళ్తుంది. చెత్తగా పడేసే అల్యూమినియం ఫాయిల్‌ను రీసైకిల్ చేస్తూ, మీ తోటలోని మొక్కలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిన్న చిన్న చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.