
కంటి చూపు మెరుగుపడుతుంది: మిర్చి ఆకుల్లో విటమిన్ A అత్యధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి.

గుండె ఆరోగ్యం మెండుగా ఉంటుంది: ఈ ఆకులలో ఉండే ఫైటోకెమికల్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను వేగవంతం చేసి, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తూ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మిర్చి ఆకుల్లో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.

మధుమేహం, జీర్ణక్రియ నియంత్రణ: శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరించి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఈ ఆకులు తోడ్పడతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, ఇవి జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు చర్మంపై వచ్చే చిన్నపాటి కురుపులు, అలర్జీలను తగ్గిస్తాయి.

ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి?: పాలకూర, తోటకూర లాగానే మిర్చి ఆకులను శుభ్రం చేసి పప్పులో వేసి వండుకోవచ్చు లేదా వేపుడు లాగా చేసుకోవచ్చు. ఆకులను నీటిలో బాగా మరిగించి, కొద్దిగా మిరియాల పొడి కలిపి హెల్తీ సూప్‌లా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఆకులతో రోటి పచ్చడి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది.

గమనిక, జాగ్రత్తలు: మిర్చి ఆకులు కొద్దిగా ఘాటు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పరిమితంగానే ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లేదా తీవ్రమైన గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.