
పాలకూర: ఆకుకూరల్లో రారాజు పాలకూర. కానీ దీనిని పచ్చిగా తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ. పాలకూరలో E.coli బ్యాక్టీరియాతో పాటు టేప్‌వార్మ్ గుడ్లు ఉండే అవకాశం ఉంది. ఇవి కడిగినా పోవు. పచ్చి పాలకూరలో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. పాలకూరను ఉడికించడం లేదా ఆవిరి మీద ఉడకబెట్టడం వల్ల బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా ఆక్సలేట్లు కూడా తగ్గుతాయి.

క్యాబేజీ: క్యాబేజీని సలాడ్లలో వాడటం మనకు అలవాటు. కానీ ఇది చాలా ప్రమాదకరం. క్యాబేజీ పొరల్లో ఉండే టేప్‌వార్మ్ గుడ్లు మన రక్తప్రవాహంలోకి చేరి, అక్కడి నుండి మెదడుకు చేరుతాయి. దీనివల్ల న్యూరోసిస్టిసెర్కోసిస్ అనే తీవ్రమైన పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పేగులను, మెదడును సురక్షితంగా ఉంచుకోవాలంటే క్యాబేజీని బాగా ఉడికించి మాత్రమే తినాలి.

వంకాయ: వంకాయను పచ్చిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. వంకాయలో సోలనిన్ అనే సహజ విష సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. వంకాయను వండటం వల్ల ఆ విషం తటస్థీకరించబడి సురక్షితంగా మారుతుంది.

ఇతర ప్రమాదకర కూరగాయలు: వీటితో పాటు క్యాప్సికమ్, చామదుంప ఆకులు, కాలే వంటి వాటిని కూడా పచ్చిగా తీసుకోకూడదు. వీటిలో ఉండే వ్యాధికారకాలు మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి.

డాక్టర్లు ఏమంటున్నారు: ఆరోగ్యకరమైన ఆహారం అంటే మీరు ఏమి తింటున్నారు అన్నదే కాదు.. దానిని ఎలా తింటున్నారు అనేది కూడా ముఖ్యం. కూరగాయలను సరిగ్గా కడిగి, ఉడికించడం వల్ల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందవచ్చు. పోషకాలు శరీరానికి బాగా అందుతాయి.