
దోశ పిండి కోసం కావలసిన పదార్థాలు: 1 కప్పు పెద్ద సగ్గుబియ్యం, అర కప్పు గుండు మినప్పప్పు, 1 కప్పు రేషన్ బియ్యం లేదా ఏదైనా బియ్యం, పావు టీస్పూన్ మెంతులు, రుచికి సరిపడా ఉప్పు స్పెషల్ కొబ్బరి చట్నీ కోసం: అర చిప్ప పచ్చికొబ్బరి ముక్కలు తరుగు, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్క, తాజా కొత్తిమీర, కరివేపాకు, చిన్న ముక్క చింతపండు, తగినంత ఉప్పు, తాలింపు కోసం పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ

తయారీ విధానం: ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యం, అర కప్పు మినప్పప్పు, ఒక కప్పు బియ్యం మరియు పావు స్పూన్ మెంతులు వేయాలి. వీటిని నీళ్లతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి 4 నుండి 6 గంటల పాటు నాననివ్వాలి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్‌లో కొద్దికొద్దిగా వేసుకుంటూ, తగినన్ని నీళ్లు పోసి కాటుకలా చాలా మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన బ్యాటర్‌ను గిన్నెలోకి తీసుకుని చేత్తో బాగా కలపాలి. మూతపెట్టి రాత్రంతా (సుమారు 6 గంటలు) గది ఉష్ణోగ్రత వద్ద పులియబెట్టాలి. ఉదయానికల్లా పిండి చక్కగా పొంగి ఫెర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అవసరమైతే కొద్దిగా నీళ్లు కలిపి దోశ పిండి జారుడు కన్సిస్టెన్సీకి తీసుకురావాలి.

మిక్సీ జార్‌లో పచ్చికొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, చిన్న చింతపండు ముక్క, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువతో తాలింపు పెట్టి చట్నీలో కలపాలి.

స్టవ్ వెలిగించి దోశ పెనం బాగా వేడిచేయాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని వేసి పల్చగా రౌండ్‌గా స్ప్రెడ్ చేయాలి. పైనుంచి కొద్దిగా నూనె వేసి మీడియం మంటపై దోరగా ఎర్రగా కాలే వరకు కాల్చి మడతపెట్టాలి. మృదువుగా కావాలనుకుంటే కాస్త మందంగా వేసి రెండు వైపులా కాల్చుకోవచ్చు. అంతే, వేడివేడిగా క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం దోశలు సిద్ధం! కమ్మని కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీతో వడ్డిస్తే ఇంట్లో వాళ్లంతా ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు.