
ముందుగా రెండు కప్పుల పొట్టు మినప్పప్పును శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల పాటు నానబెట్టాలి. మీరు పొట్టు లేని పప్పును ఉపయోగిస్తుంటే నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది. రాత్రంతా నానబెట్టుకుంటే ఉదయం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. నానిన పప్పు నుండి పొట్టును పూర్తిగా తొలగించడానికి బాగా కడుక్కోవాలి. నీటిని వృధా చేయకుండా, కడిగిన నీటినే తిరిగి వాడుకుంటూ పొట్టును సులభంగా తొలగించవచ్చు. పొట్టు పూర్తిగా తొలగించిన తర్వాత, పప్పులోని నీరంతా పూర్తిగా వడిపోవడానికి ఒక గిన్నెలో వేసి అరగంట పాటు పక్కన పెట్టాలి. పప్పులో నీళ్లు అస్సలు ఉండకూడదు, అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి.

పప్పులోని నీళ్లన్నీ వడారిన తర్వాత, అందులో నుండి అరకప్పు పప్పును పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, చిన్న ముక్కలుగా తరిగిన రెండు అంగుళాల అల్లం, పొట్టు తీసిన 15 వెల్లుల్లి రెబ్బలు, నాలుగు పచ్చిమిర్చి, మూడు లేదా నాలుగు ఎండుమిర్చి వేయాలి. నీళ్లు అస్సలు పోయకుండా, ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాను ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

అదే మిక్సీ జార్లో పక్కనపెట్టిన మిగిలిన మినప్పప్పును కొద్దికొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. జార్‌ను సగం వరకు మాత్రమే నింపి, మధ్యమధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్‌లో రుబ్బుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా, కొంచెం పలుకులుగా ఉండేలా, ముద్దగా, గట్టిగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని మసాలా గిన్నెలో వేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పక్కనపెట్టుకున్న అరకప్పు నానబెట్టిన మినప్పప్పు, రుచికి సరిపడా ఉప్పు (సుమారు 1 టీ స్పూన్) వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, కొత్తిమీరలో తడి లేకుండా చూసుకోవాలి, లేదంటే పిండి పల్చబడుతుంది. పిండి గట్టిగా ఉండేలా జాగ్రత్తపడాలి.

చేతిని కొద్దిగా నీళ్లతో తడుపుకుని, కొద్దికొద్దిగా పిండిని తీసుకుని వడలుగా ఒత్తుకోవాలి. వడలు ఒత్తడానికి తడిపిన కాటన్ క్లాత్ ను ఉపయోగించవచ్చు. వడలను కొంచెం పల్చగా ఒత్తుకోవాలి, లావుగా ఉండకూడదు.నూనెను బాగా వేడి చేసి, మంటను మధ్యస్థంగా ఉంచాలి. ఒత్తుకున్న వడలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా, పచ్చిదనం తగ్గిన తర్వాత అటూ ఇటూ తిప్పుకుంటూ బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. మధ్యస్థ మంటపై నిదానంగా వేయించడం వల్ల వడలు లోపల వరకు ఉడికి, కరకరలాడుతూ వస్తాయి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే బయట రంగు వచ్చి లోపల మెత్తగా ఉంటాయి. వడలు నూనెను ఎక్కువగా పీల్చుకోవు.బాగా కాలిన వడలను తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో వడలను తయారు చేసుకోవాలి. రెండు కప్పుల పప్పుతో సుమారు 27 నుండి 30 వడలు తయారు చేసుకోవచ్చు.