
కావాల్సిన పదార్దాలు : నీళ్లు: ఒకటిన్నర కప్పులు, జొన్నపిండి: రెండు కప్పులు, సాల్ట్: ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ (రుచికి సరిపడా), కారం: ఒక టీ స్పూన్ (రుచికి తగ్గట్టు), జీలకర్ర: ఒక టీ స్పూన్, నువ్వులు: ఒక టేబుల్ స్పూన్ (పచ్చివి), అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్, పెసరపప్పు: పావు కప్పు (అరగంట నానబెట్టి, నీళ్లు వంపేసినవి), కరివేపాకు: సన్నగా తరిగినది (కొద్దిగా) ఆయిల్: ఒక టేబుల్ స్పూన్ (పిండిలో కలపడానికి), నూనె: వేయించడానికి సరిపడా తీసుకోవాలి.

ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఏదైనా గిన్నెను పెట్టి, అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. మూత పెట్టి నీళ్లను బాగా మరిగించాలి.నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత సాల్ట్ (సుమారు ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ), ఒక టీ స్పూన్ కారం (మీ రుచికి తగ్గట్టు), ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

అరగంట పాటు నానబెట్టిన పావు కప్పు పెసరపప్పును నీళ్లన్నీ వంపేసి వేసుకోవాలి. అలాగే, సన్నగా తరిగిన కరివేపాకు, చివరిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ సమయంలో స్టవ్ ఆఫ్ లోనే ఉండాలి.ఇప్పుడు రెండు కప్పుల జొన్నపిండిని ఈ మిశ్రమంలో వేయాలి. ఒకటిన్నర కప్పుల నీళ్లకు రెండు కప్పుల జొన్నపిండి సరిగ్గా సరిపోతుంది. బయట కొన్న పిండి అయినా, ఇంట్లో తయారు చేసుకున్న పిండి అయినా ఉపయోగించవచ్చు. పిండిని వేడి నీళ్లలో ఉండలు లేకుండా గరిటెతో బాగా కలపాలి. ఇలా వేడి నీళ్లతో కలపడం వల్ల పిండికి జిగురు వచ్చి చెక్కలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. పిండి మొత్తం బాగా కలిసిపోయేవరకు గరిటెతో మ్యాష్ చేసినట్లుగా కలపండి.

పిండిని కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వాలి. పిండి చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు, దాన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మర్దనా చేస్తే చెక్కలు అంత బాగా వస్తాయి. పిండిని గట్టిగానే కలుపుకోవాలి. పొరపాటున పల్చగా అనిపిస్తే కొద్దిగా జొన్నపిండి కలుపుకోవచ్చు.పిండిని బాగా కలిపేసుకుని, ఒక వాయికి సరిపడా పిండిని తీసుకుని, మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టాలి. కొంచెం కొంచెంగా పిండి తీసుకుని, మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. పెద్ద చెక్కలు కావాలంటే పెద్ద ఉండలు, చిన్నవి కావాలంటే చిన్న ఉండలు చేసుకోవచ్చు. బటర్ పేపర్ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకుని, కొంచెం నూనెతో గ్రీస్ చేయాలి. ఒక పిండి ముద్దను దానిపై పెట్టి, కవర్ పెట్టిన గిన్నెతో గట్టిగా నొక్కామంటే చెక్కలు సులభంగా తయారవుతాయి. పూరీ ప్రెసర్ ఉన్నా ఉపయోగించవచ్చు. మరీ లావుగా కాకుండా, మరీ పలుచగా కాకుండా చెక్కలను ఒత్తుకోవాలి.

తయారుచేసిన చెక్కలను తడి క్లాత్ పైన వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేయాలి. నూనెకు సరిపడా వేసిన వెంటనే కదపొద్దు. పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో బంగారు రంగు వచ్చేవరకు, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన రంగు వచ్చి లోపల మెత్తగా ఉండిపోతాయి. నూనెలో నురుగులు తగ్గిన తర్వాత తీసి, నూనె వడగట్టాలి. ఒకసారి తీసిన తర్వాత ఫ్లేమ్‌ను లోలో పెట్టండి, లేదంటే నెక్స్ట్ వాయికి నూనె మరీ వేడెక్కుతుంది. మళ్ళీ మీడియం ఫ్లేమ్‌కు సర్దుబాటు చేసి మిగిలిన చెక్కలు వేయించుకోవాలి. ఈ చెక్కలు వేడి తగ్గిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు తాజాగా, క్రిస్పీగా ఉంటాయి.