అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. అది కూడా ఫీల్డింగ్ ద్వారానే కావడం విశేషం.
అవును, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ క్రమంలోనే 9వ స్థానంలో వచ్చిన నాథన్ లియాన్.. అశ్విన్ వేసిన బంతిలో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
లియాన్ ఇచ్చిన క్యాచ్ పట్టడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 300 క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరాడు. విశేషమేమిటంటే.. టీమిండియా తరఫున రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఇలా 300 ఇంటర్నేషనల్ క్యాచ్‌లు పట్టిన ఘనత సాధించాడు.
టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ద్రవిడ్ 509 మ్యాచ్‌ల్లో మొత్తం 334 క్యాచ్‌లు అందుకున్నాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో 300కు పైగా క్యాచ్‌లు పట్టిన 5వ ఆటగాడిగా ద్రావిడ్ ఉన్నాడు.
అలాగే భారత్ తరఫున కోహ్లీ తర్వాత మాజీ ఆటగాడు మొహమ్మద్ అజరుద్దీన్ 261 క్యాచ్‌లు పట్టి మూడో స్థానంలో ఉన్నాడు.
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్రపంచ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే 652 మ్యాచ్‌ల్లో 440 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించాడు.
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 494 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 300 క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 2వ భారత ఆటగాడిగా, అలాగే ప్రపంచ క్రికెట్‌లో 7వ ప్లేయర్‌గా కింగ్ కోహ్లీ అవతరించాడు.
ఇక ఈ మ్యాచ్ విశేషమేమంటే కోహ్లీ దాదాపు 40 నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లో తన సెంచరీని నాలుగో రోజు ఆటలో సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 167వ ఓవర్ పూర్తయే సమయానికి మొత్తం 326 బంతులు ఆడిన కోహ్లీ 168 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. ఇందులో 15 ఫోర్లు కూడా ఉన్నాయి. అలాగే కోహ్లీతో పాటు ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(95 బంతుల్లో 50 పరుగులు; 4 ఫోర్లు, 1 సిక్సర్) ఉన్నాడు.